మాకూ రుణమాఫీ వర్తింపజేయాలి
ఎమ్మెల్సీ యాదవరెడ్డికి మల్లన్నసాగర్ ముంపు గ్రామస్తుల వినతి
గజ్వేల్, ఆగస్టు24: మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు కూడా రైతు రుణమాఫీ వర్తింపజేయాలని మల్లన్నసాగర్ ముంపుగ్రామాల మాజీ సర్పంచ్‌లు, నాయకులు శనివారం ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిని కోరారు. ఈ మేరకు తమ సమస్యలను కలెక్టర్, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వారు శనివారం ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేశారు. మల్లన్నసాగర్‌లో తాము భూములు కోల్పోయినా తమ పేరున బ్యాంకుల్లో అప్పు ఉందని.. వాటిని గత ప్రభుత్వం మాఫీ చేస్తామని చెప్పినప్పటికీ అది జరగలేదన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ తమకు కూడా వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అలాగే ముంపు గ్రామాల్లోని ఒంటరి మహిళలు, పురుషుల ప్యాకేజీలను ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని వెంటనే ఇప్పించాలని కోరారు. ముంపు గ్రామాలకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో పునరావాసం కల్పించారని.. అయితే తమ కాలనీలను మున్సి పాలిటీలో విలీనం చేయవద్దని ప్రభుత్వానికి విన్నవించాలన్నారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో లక్ష్మాపూర్, బ్రాహ్మణ బంజరుపల్లి మాజీ సర్పంచ్‌లు, ప్రజలు ఉన్నారు.






