calender_icon.png 2 August, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

01-08-2025 10:33:11 PM

మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి..

టిజిబీ ఆర్ఎం ప్రభుదాస్..

మంచిర్యాల (విజయక్రాంతి): మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మంచిర్యాల రీజనల్ మేనేజర్ దాముక ప్రభుదాస్(Regional Manager Damuka Prabhudas) కోరారు. శుక్రవారం సీతారాంపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆవరణలో 36 మెప్మా మహిళా సంఘాలకు జూలై నెలలో విడుదల చేసిన రూ. 6.50 కోట్ల రుణ మంజూరు చెక్కులను ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ రాజ మనోహర్(Assistant Commissioner Raja Manohar)తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ, తమ యొక్క సీతారాంపల్లి శాఖ పరిధిలో మహిళా సంఘాలు బాగా పనిచేస్తున్నాయని, ఇప్పటి వరకు 632 మహిళా సంఘాలకు 50 కోట్ల రూపాయలు రుణాల రూపంలో మంజూరు చేయడం జరిగిందన్నారు.

మహిళా సంఘాల సభ్యులకు మహిళా ముద్ర యోజన పథకం కింద 30 మంది మహిళలకు 15 లక్షల రూపాయల రుణాలను మంజూరు  చేశామన్నారు. మహిళా సంఘాల పుస్తకాల నిర్వహణ, అంతర్గత రుణ చెల్లింపుల పనితీరు, బ్యాంకు రుణాల సక్రమ చెల్లింపుల ఆధారంగా ఆయా గ్రూపులకు మరిన్ని సౌకర్యాలు లభిస్తాయన్నారు. మహిళ సంఘాలకు అర్హతను బట్టి తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా 20 లక్షల రూపాయల వరకు రుణం మంజూరు చేయడం జరుగుతుందని, అదేవిధంగా సక్రమంగా చెల్లించే గ్రూపులలోని సభ్యులు ఇతర వృత్తులు చేసుకునేందుకు గాను మహిళా ముద్ర యోజన కింద తలా 50 వేల రూపాయల వరకు అదనపు రుణం ఇస్తున్నామన్నారు. 

సామాజిక భద్రత అవసరమే..

బ్యాంకు రుణాలు తీసుకోవడంతో పాటు సామాజిక భద్రతా ముఖ్యమేనని టి జి బి ఆర్ఎం ప్రభుదాస్ అన్నారు. ఏడాదికి 20 రూపాయలు కట్టి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరి 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని, అలాగే ప్రతి సంవత్సరం 436 రూపాయలు కట్టి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకం ద్వారా సాధారణ మరణానికి 2 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం పొందవచ్చునని, అలాగే 18 నుంచి 40 సంవత్సరాలలోపు వయసు గల మహిళలు గాని పురుషులు గాని అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరి ప్రతినెల లేదా మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి తగినంత ప్రీమియం 60 సంవత్సరముల వరకు చెల్లించడం ద్వారా, 60 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతి నెల 1000 నుంచి 5000 వరకు పెన్షన్ సౌకర్యం భార్యాభర్తలీద్దరు తమ జీవితకాలమంతా పొందవచ్చునని తెలిపారు.

అంతేకాకుండా తాము చేసుకున్న పొదుపుల నుండి బ్యాంకులో ప్రతినెల రికరింగ్ డిపాజిట్ పథకాలలో చేరి చిన్న మొత్తాలు 500 నుండి మొదలుకొని 10000, 20000 ఇంకా ఎక్కువ కూడా కట్టుకోవడం ద్వారా నిర్ణీత సమయానికి పెద్ద మొత్తం జమ అయి ఆర్థిక సుస్థిరత చేకూరి భవిష్యత్తు అవసరాలకు పనికి వస్తుందని తెలిపారు. తమ బ్యాంకు శాఖల ద్వారా అతి తక్కువ ప్రీమియంతో హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకొని సమయానికి లబ్ధి పొందిన ఖాతాదారులు కూడా చాలామంది ఉన్నారని తెలిపారు. అదేవిధంగా బ్యాంకు ఖాతాదారులందరూ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలలో చేరడం ద్వారా 'క్యాష్ లెస్ పద్ధతి'లో భవిష్యత్తులో సంభవించే ఆరోగ్య ఇబ్బందుల నుండి రక్షణ పొందడం జరుగుతుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడిన నాడే కుటుంబము, సమాజము సుభిక్షంగా ఉంటాయని తద్వారా దేశ ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు. 

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ రాజ మనోహర్ మాట్లాడుతూ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఒక్క నెలలోనే మహిళా సంఘాలకు 6.50 కోట్ల రుణాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం  ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా తీసుకోవడం జరుగుతుందని, వివిధ బ్యాంకు పథకాలను మహిళా సంఘాల సభ్యులు మరింతగా ఉపయోగించుకోవాలంటే ప్రతినెల సక్రమంగా రుణకిస్తులను బ్యాంకులో జమ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్, మంచిర్యాల రీజియాన్ రుణాల ప్రధాన అధికారి రవి కిషోర్ రెడ్డి, సీతారాంపల్లి శాఖ మేనేజర్ నరసింహస్వామి,  ఫీల్డ్ ఆఫీసర్ రవి, ఇతర బ్యాంకు సిబ్బంది, మెప్మా యొక్క టీఎంసీ నాగరాజు, ఆర్పీలు, రుణాలు పొందిన మహిళా సభ్యులు, ఇతర బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు.