కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు
లేదంటే ఎన్నికల నిర్వహణను అడ్డుకుంటాం
సీఎం రేవంత్‌కు లేఖ రాసిన ఎంపీ ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, మే 17(విజయక్రాంతి): బీసీ కులగణన చేసి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం లేఖ రాశారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు 22 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని, అదే విధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కులగణన జరిపి స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50 శాతం పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. రిజర్వేషన్ పెంచకుండా స్థానిక ఎన్నికలకు వెళితే అడ్డుకుంటామని హెచ్చరించారు.
1986లో బీసీ సంక్షేమ సంఘం అనేక ఉద్యమాలు చేయగా నాటి సీఎం ఎన్‌టీఆర్ స్పందించిన బీసీలకు జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో 20 శాతం రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. అదే విధంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని 6 సంవత్సరాలు ఉద్యమాలు చేయగా 1993లో అప్పటి ముఖ్యమంత్రి 20 శాతం నుంచి 34 శాతం పెంచుతూ రిజర్వేషన్లు పెట్టారన్నారు. నాటి నుంచి 2019 వరకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగాయన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2019లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడంతో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. అప్పటినుంచి జాతీయ బీసీ సంఘం అధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి ఒత్తిడి తీసుకురావడంతో అన్ని పార్టీలు బీసీ కులగణన నిర్వహించి రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ పెంచే అంశాన్ని పరిగణనలోకి తీసుకుని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కృష్ణయ్య లేఖలో స్పష్టం చేశారు.




