13-11-2025 12:17:46 AM
-రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
-ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష
ఆదిలాబాద్, నవంబర్ 12 (విజయక్రాం తి): స్థానిక సంస్థలు ఆర్థిక స్థితి బలోపేతం కావడం ద్వారానే గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. ఇందుకుగాను విడుదలైన నిధుల్లో ప్రతి రూపాయిని ప్రజా ప్రయోజనాలకు వినియోగించుకోవాలని సూచించారు. ఫైనాన్స్ కమిషన్ బృందం సభ్యుల జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం కమిషన్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో కమిషన్ సభ్యుడు రమేష్, కార్యదర్శి కాత్యాయిని దేవి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్, కుమార్ దీపక్, వెంకటేష్ దోత్రే, స్థానిక సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనంతరం ఉమ్మడి జిల్లా పరిధిలోని పంచాయతీల ఆదాయం, వ్యయాల స్థితి, పన్నుల వసూళ్లు, నిధుల వినియోగం, పేదరిక నిర్మూలన, గ్రామీణ గృహనిర్మాణం, విద్యుత్, తాగునీటి సరఫరా, రహదారులు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర వివరాలు అందజేశా రు. ఈ సందర్భంగా చైర్మన్ రాజయ్య మాట్లాడుతూ... గ్రామీణాభివృద్ధి వేగవంతం కావా లంటే స్థానిక సంస్థల ఆర్థిక స్థితి బలోపేతం కావడం అత్యవసరమని తెలిపారు. నిధుల వినియోగం పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండాలని, పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రజల ప్రాధమిక అవసరాలపై దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
కేంద్ర, రాష్ట్ర నిధుల ద్వారా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలన్నారు. ప్రజాస్వామ్యం ఫలాలు సామాన్య ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య పరిశ్రమ, అటవీ, చిన్నతరహా పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం వంటి రంగాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి పునాదులని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో, సమగ్ర ప్రణాళికతో పనిచేస్తే స్థిరమైన గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల ఆర్థిక స్థితిగతులను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు సోమ రాజేశ్వర్, ఫైజాన్ అహ్మద్, దీపక్ తివారి, ఆర్డీఓ స్రవంతి, పంచాయతీ రాజ్, శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.