calender_icon.png 11 October, 2025 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత విధానంలో స్థానిక ఎన్నికలు నిర్వహించవచ్చు: హైకోర్టు

11-10-2025 09:30:34 AM

హైదరాబాద్: పాత విధానంలో స్థానిక ఎన్నికలు నిర్వహించవచ్చని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై 50 శాతానికి మించొద్దని తెలిపింది. రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో 9,41, 42పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. గడువు తీరిన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. పాత విధానంలోనే స్థానిక ఎన్నికలకు ముందుకు వెళ్లవచ్చని ఆదేశించింది. బీసీలకు(BC Reservations) 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఇచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే ఇచ్చినట్లు తెలిపింది. జీవో 9పై స్టే ఇచ్చినందున దామాషా సీట్లను ఓపెన్ కింద నోటిఫై చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీ కింద నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించింది. వికాస్ కిషన్ రావు గవాలి కేసును హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. గవాలి కేసును పరిగణలోకి తీసుకుని జీవో 9,41, 42 ను హైకోర్టు నిలిపివేసింది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని కోర్టు తెలిపింది. బీసీ రిజర్వేషన్ల పెంపు వల్ల మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరాయని వెల్లడించింది. బీసీ రిజర్వేషన్లు పెంచకముందు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం ఉన్నాయని చెప్పింది. ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ముందు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ట్రిపుల్ టెస్ట్ విధానం అమలు చేయాల్సిందేనని పేర్కొంది. రిజర్వేషన్ల పెంపుపై పలు తీర్పులను ప్రభుత్వం తమ దృష్టికి తెచ్చిందని హైకోర్టు పేర్కొంది. రిజర్వేషన్ల పెంపుపై అన్ని తీర్పులను పరిశీలించామని హైకోర్టు తెలిపింది. 50 శాతం పరిమితి అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని, ఎన్నికల ప్రక్రియను నిలిపివేయలేదని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. పిటిషన్లపై వివాదం తేలే వరకు జీవోలు 9,41,42 నిలిపివేస్తున్నట్లు తెలిపింది.