calender_icon.png 5 December, 2024 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి రైతు బతుకు ఆగం!

07-11-2024 01:00:27 AM

  1. గిట్టుబాటు ధర లేక అవస్థలు
  2. ఖమ్మం మార్కెట్‌లో వ్యాపారుల నిలుపుదోపిడీ

ఖమ్మం, నవంబర్ 6 (విజయక్రాంతి): పత్తికి గిట్టుబాటు ధర లేక రైతు బతుకు ఆగమవుతున్నది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదుర్కుని చేతికి వచ్చిన పత్తిని మార్కెట్‌కు తీసుకువస్తే వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. తెలంగాణాలోనే ఖమ్మం పత్తి మార్కెట్‌కు మంచి పేరుంది. ఖమ్మం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి పత్తిని తీసుకువచ్చి అమ్ముతుంటారు.

ఖమ్మం జిల్లా లో ఈసారి దాదాపు 2 లక్షల ఎకరాలకు పైగానే జిల్లాలో పత్తిని సాగు చేశారు. భారీ వర్షాలు, వరదలతో చీడపీడలు పెరిగి దిగుబడి అంతంత మాత్రంగానే పొందారు. వచ్చిన అరకొర దిగుబడినైనా అమ్ముకుందామని ఖమ్మం మార్కెట్‌కు వెళ్తే వ్యాపారులంతా కుమ్మక్కై నిలువుదోపిడీ చేస్తున్నారు.

ఖమ్మం జిల్లాతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా భారీగా పత్తి వచ్చే మార్కెట్‌లో ఎందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రం మార్కెట్‌లో కాకుండా ఎక్కడో జిన్నింగ్ మిల్లు ఉన్న చోట ఏర్పాటు చేశారు. అంత దూరం రైతులు వెళ్లలేక మార్కెట్‌లోనే వ్యాపారులు ఇస్తున్న రేటుకు అమ్ముతూ నష్టపోతున్నారు.  

కుమ్మక్కై ధర లేకుండా చేస్తున్నారు 

నాకున్న అర ఎకరంలో పత్తి  వేశాను. రూ.10 వేలకు పైగా ఖర్చు అయింది. ఇంకా పత్తి తీ సేందుకు కూలితో పాటు మార్కెట్‌కు రావడానికి విపరీతమైన ఖర్చు అయింది. కానీ మార్కెట్‌కు వచ్చేసరికి ధర లేకుండా పోయింది. రేటు కేవలం క్వింటాలుకు రూ.6600 ఉంది. వ్యాపారులంతా కుమ్మక్కై మాకు ధర లేకుండా చేస్తున్నారు.

 -షేక్ మస్తాన్,రఘునాధపాలెం

మందు తాగి చావాలనిపిస్తుంది

నాకున్న ఆరు ఎకరాలతోపాటు మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిని సాగు చేశా. అకాల వర్షాల వల్ల ఎకరానికి 10 బస్తాల దిగుబడి వచ్చింది. పెట్టుబడి రూ.3 లక్షలకు పైగానే అయింది. ఖమ్మం మార్కెట్‌కు 400 బస్తాలు తీసుకుని వస్తే గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. వ్యాపారులంతా కుమ్మక్కై ధర రాకుండా దోచుకుంటున్నారు. క్వింటాలుకు రూ.6,300 మాత్రమే ఇస్తానంటున్నారు. మందు తాగి చావాలనిపిస్తుంది.

 -తేజావత్ నందా, బాబాయ్‌తండా 

దోపిడీ చేస్తున్నారు.. ఆదుకోండి 

నాకున్న 8 ఎకరాలకు తోడు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. భారీ వర్షాలు, వరదలతో ఎకరానికి 6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. మార్కెట్‌కు తీసుకెళ్తే అందినకాడికి దోపిడీ చేస్తున్నారు. సీసీఐ సెంటర్‌ను మార్కెట్‌లో కాకుండా పాతర్లపాడులో ఏర్పాటు చేశారు. ముగ్గురు మంత్రులు పట్టించుకుని మమ్మల్ని ఆదుకోవాలి.

 -ధరావత్ లక్ష్మణ్, కొణిజర్ల