సిరుసనగండ్లలో వైభవంగా రాములోరి కల్యాణం
- పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు
- ఆలయ అభివృద్ధికి రూ.3 కోట్ల నిధుల ప్రకటన
- స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి
చారకొండ, మార్చి 27: జగదానంద కారకుడి కల్యాణాన్ని చూసి తరించిన భక్తజనం.. వేద మంత్రోచ్ఛారణల మధ్య పులకించిన శిరుసనగండ్ల గిరి. అపర భద్రాద్రిగా పేరుగాంచిన నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ సిరుసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకను వీక్షించేందుకు ఉమ్మడి జిల్లాల నుండి భక్తులు వేలాదిగా తరలిరావడంతో క్షేత్రమంతా భక్తిభావంతో ఉప్పొంగింది.
ఆలయం ముందున్న కల్యాణ మండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన వేదికపై సీతారామచంద్ర స్వామి కల్యాణ ఘట్టం మొదలైంది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ క్రతువు మధ్యాహ్నం 1:30 వరకు కొనసాగింది. అర్చకస్వాముల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ నయనానందకరంగా సాగిన ఈ వేడుక భక్తులను ఆధ్యాత్మిక ఒడిలో ఓలలాడించింది.
దేవతామూర్తులకు పట్టు వస్త్రాల సమర్పణ, జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు పోసే వేడుకలను మన సంస్కృతి ప్రతిబింబించేలా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దంపతులు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యాణ రాముడిని పెండ్లి కుమారుడిగా, సీతమ్మ తల్లిని పెండ్లికుమార్తెగా వేదికపై దర్శనం చేసుకున్న భక్తజనం పులకించిపోయింది. కల్యాణం అనంతరం భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిరుసనగండ్ల క్షేత్ర మహిమను కొనియాడారు. భక్తుల సౌకర్యార్థం, దేవాలయ సమగ్ర అభివృద్ధి కోసం రూ. 3 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఉప్పల వెంకటేశ్, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాలు, ఆలయ చైర్మన్ రామశర్మ, స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కందనూలులో ఘనంగా సీతారాముల కళ్యాణం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవో పేతంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. వారితోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునీంద్ర, వైస్ చైర్మన్ నరేందర్, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సీతారాముల కల్యాణ వేడుకను తిలకించేందుకు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎండ తీవ్రత దృష్ట్యా సల్వ పందిల్లు కూలర్లు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వారికి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, ఆయా కుల సంఘాలు ఆయా పార్టీ నేతలు మంచినీరు, మజ్జిగ, భోజనం పంపిణీ వంటి కార్యక్రమంలో పాల్గొన్నారు.




