04-12-2025 01:44:35 AM
మహబూబాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): రోడ్డుపై లారీని ఎలాంటి హెచ్చరికలు లేకుండా నిలపడంతో స్కూటీ పై వెళ్తున్న యువ రైల్వే ఇంజనీర్ గమనించకుండా వెనుక నుండి ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా జామాండ్లపల్లి వద్ద బుధవారం ఉదయం జరిగింది. మహబూబాబాద్ రూరల్ ఎస్ ఐ దీపిక కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తోగర్రాయి గ్రామానికి చెందిన పిరాల భగవత్ (30) డోర్నకల్ రైల్వే శాఖలో జూనియర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యలో నిలిపి ఉన్న లారీని గమనించకుండా వెనుక నుండి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల్లో భగత్ కు వివాహం జరగాల్సి ఉందని, ఎదిగిన కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబ సభ్యుల రోదనలతో ప్రతి ఒక్కరూ చలించిపోయారు.