9 July, 2026 | 5:27 AM

లగ్జరీ ఇండ్ల అమ్మకాల జోరు

12-05-2024 12:05 AM

రెసిడెన్షియల్ రియాల్టీలో మూడింతలు పెరిగిన వాటా

ముంబై, మే 11: దేశంలో చౌక గృహాలతో పోలిస్తే లగ్జరీ ఇండ్ల అమ్మకాలు జోరుగా పెరుగుతున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ గ్రూప్ తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. రూ.1.5 కోట్ల ధరను మించినవాటిని విలాసవంతమైన గృహాలుగా పరిగణిస్తూ, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో వీటి వాటా ఐదేండ్లలో మూడింతలయ్యిందని అనరాక్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 2024 తొలి త్రైమాసికంలో విక్రయమైన మొత్తం రెసిడెన్షియల్ యూనిట్లలో లగ్జరీ గృహాల వాటా 21 శాతానికి పెరిగిందన్నది. 2019 ఇదేకాలంలో వీటి వాటా 7 శాతమేనని పేర్కొంది. ఈ ఐదేండ్లలో చౌక గృహ యూనిట్ల అమ్మకాల వాటా 37 శాతం నుంచి 18 శాతానికి తగ్గినట్టు తెలిపింది. మిడ్‌రేంజ్, ప్రీమియం హౌసింగ్ విభాగం (రూ.40 లక్షలు కోట్ల ధర మధ్య) రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌లో 59 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయిస్తున్నదని అనరాక్ రిపోర్ట్ వివరించింది. ఆయా నగరాల్లో ప్రైమ్ లోకేషన్లలో బ్రాండెడ్ డెవలపర్స్ నిర్మిస్తున్న పెద్ద ఇండ్లపై మోజు పెరగడంతో లగ్జరీ విభాగం జోరందుకుంటున్నదని అనరాక్ చైర్మన్ అనూజ్ పురి చెప్పారు.