13 May, 2026 | 5:50 PM

7న వరంగల్‌లో మాదిగల ఆత్మగౌరవ కవాతు

21-06-2024 01:22 AM

ఎంఆర్‌పీఎస్ చీఫ్ మంద కృష్ణమాదిగ వెల్లడి

సీఎం రేవంత్ తీరుతోనే కాంగ్రెస్‌కు దూరం

ఎస్సీ వర్గీకరణ అయ్యేదాకా నియామకాలు చేపట్టొద్దు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20(విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అయ్యేదాకా ఎస్సీ కేటగిరీ నియామకాలు చేపట్టవద్దని, స్థానిక సంస్థల ఎన్నికలూ నిర్వహిం చవద్దని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రభు త్వాన్ని కోరారు. ఎంఆర్‌పీఎస్ 3 దశాబ్దా ల ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలో జూలై 7న మాదిగల ఆత్మగౌరవ కవాతు నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.

గత ప్రభుత్వం ఒక్కరోజులోనే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినా కులగణన చేపట్టకపోవడం విచారకరమని విమర్శించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో తక్షణమే అన్ని వర్గాల రిజర్వేషన్లను పెంచాలన్నారు. రాష్ట్రంలో మాదిగల వల్లనే బీజేపీ ఓటు బ్యాంకింగ్ 21 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలి వల్లే  మాదిగలు, బీసీలు కాంగ్రెస్‌కు దూరమయ్యారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కీలక దశకు చేరిన సమయంలో పార్లమెంటులో ఒక్క మాదిగ ఎంపీ కూడా లేకుండా  రేవంత్ రెడ్డి కుట్ర చేశారని విమర్శించారు.

జూలై 7తో సుప్రీంకోర్టు సెలవులు ముగియనున్నాయని, ఆ తర్వాత వర్గీకరణకు అనుగుణమైన తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  తమిళనాడు, ఏపీ లాంటి పరిస్థితులు తెలంగాణలో రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు తప్పవని పేర్కొన్నారు.  సమావేశంలో ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు సోమశేఖర్, ఎంఆర్‌పీఎస్ జాతీయ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, నాయకులు విష్ణు, వీఎస్ రాజు, విజయ్‌రావు, శ్రీకిషన్, జుంజూరు విజయ్, శ్యాంసన్‌రావు పాల్గొన్నారు.