1 April, 2026 | 2:45 AM

నిజాం షుగర్ ఫ్యాక్టరీకి మహర్దశ!

03-05-2024 01:31 AM

కొలిక్కి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 2 (విజయక్రాంతి) : నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం రానుంది. బోధన్‌లో మూతపడ్డ చారిత్రక నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలుగా చేసిన కృషి ఒక కొలిక్కి వచ్చింది. షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన బకాయిలను వన్‌టైం సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు అంగీకరించింది. ఈ మేరకు ప్రభుత్వం బ్యాంకర్లతో చర్చలు జరిపింది. ప్రభుత్వ ప్రతిపాదనలకు బ్యాంకర్లు అంగీకరించడంతో త్వరలోనే రూ.43 కోట్ల మేర బకాయిలను విడుదల చేయనుంది. దీంతో మూతపడ్డ చక్కెర ఫ్యాక్టరీ తెరుచుకునేందుకు మార్గం సుగమమైంది.  సెప్టెంబర్ 17లోపు షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఈ హామీని అమల్లోకి తెచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరించడం కోసం జనవరిలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు సారథ్యంలో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. చర్చలు ఫలించడంతో ఫ్యాక్టరీ తెరుచుకునేందుకు మార్గం సుగమమైంది.