16 April, 2026 | 1:46 AM

అనుక్షణం అభివృద్ధి పైనే నా ధ్యాస

04-11-2025 01:02 PM
  1. నన్ను నమ్మి గెలిపించినందుకు రుణం తీర్చుకుంటా
  2. అభివృద్ధి చేసి చూపిస్తే ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటాం
  3. అభివృద్ధి ప్రామాణికంగా కావాలని మీడియా చూపించాలి
  4. మున్సిపాలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 603 కోట్లు మంజూరు 
  5. విలేకరుల సమావేశంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్,(విజయక్రాంతి):అనుక్షణం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahbubnagar MLA Yennam Srinivas Reddy) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. మాయ మాటలు చెప్పి కాలం గడిపే అవసరం తమకు లేదని చేస్తున్న అభివృద్ధి చేయబోతున్నవాస్తవాలను మాత్రమే ప్రజల ముందు ఉంచుతున్నానని తెలిపారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో(Mahabubnagar Municipality) అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి  కల్పించేందుకుగాను రూ 603 కోట్లు మంజూరు కావడం జరిగిందని స్పష్టం చేశారు. నీటి సరఫరాకు  రూ 220.94 కోట్లు మంజూరు కావడం జరిగిందని ప్రతి పనిని పారదర్శకంగా ముందుకు తీసుకుపోతున్నామని తెలియజేశారు. 

బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నాం..

నియోజకవర్గంలో ఎప్పుడు ఎక్కడ ఏమి అవసరమో క్షుణ్ణంగా తెలుసుకుంటూ బ్రహ్మండమైన అభివృద్ధి చేస్తున్నామని మహబూబ్ నగర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లోకి ఎమ్మెల్యేను, ఎంపీని అయితానేమోనని రాలేదన్నారు. బ్రహ్మాండమైన ఉద్యోగం చేస్తూ జీవనం గడిపే నాకు తెలంగాణ మలి దశ ఉద్యమం లో భాగస్వామ్యం కావాలని ఉద్దేశంతో వచ్చానన్నారు. రాజకీయ జీవితంలో ఉన్నంతవరకు ప్రజల సంక్షేమ తప్ప మరో వ్యాపకం నాకు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం లో ఎక్కడ ఏ పథకాలు ఉన్నాయి?ఎక్కడ నిధులు ఉన్నాయని పూర్తి అవగాహన ఉండడంతో రాష్ట్రానికి కేంద్రానికి సమన్వయం చేసుకుంటున్నాను తప్ప వేరే ఆలోచనలు చేయడం లేదన్నారు. తెలంగాణలో ఏ నగరాన్ని చూసిన ఈ రెండేళ్ల కాలంలో ఎన్నో నిధులు తీసుకురావడం జరిగిందని మరే నియోజకవర్గంలో ఎన్ని నిధులు రాలేదన్నారు. ఈ విషయంపై బహిరంగ చర్చి పైన తాము సిద్దంగా ఉండాలని పేర్కొన్నారు. ఏ నిబంధనల ప్రకారం పనులు చేయాలి? చేయకూడదు సమగ్రంగా తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. మసిపూసి మారేడికాయ చేయడం నాకు తెలియదు అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు. నిధులు అత్యధికంగా రావాలంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఎల్లప్పుడూ ఉండవలసిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అంటే బిజెపి అని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అంటూ కొందరు వ్యత్యాసాలు చూపిస్తున్నారని అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వాల మధ్య ఉన్న బాధ్యతలను నిర్వహిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని కంటే అత్యధికంగా అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లో కాంగ్రెస్ ఉన్నప్పటికీ మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా బిజెపి నుంచి గెలిచినప్పుడు కూడా అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని అడుగులు వేశామని చెప్పారు. అప్పుడే మెడికల్ కళాశాల కావాలని అవసరమైన ప్రణాళికలు వేసి ప్రస్తుతం ఏర్పాటైన మెడికల్ కళాశాలకు 25 ఎకరాల సేకరణ గతంలోని చేసి సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. ప్రభుత్వాలు మారడంతో అన్ని ఏర్పాటు చేసిన మన మహబూబ్ నగర్ కు మెడికల్ కళాశాల వరించిందని తెలిపారు. ఎల్లప్పుడు అభివృద్ధి పైన పూర్తిస్థాయిలో అడుగులు వేస్తున్నామని తెలిపారు. 

నాయకుడికి వచ్చే ఎన్నికలు... ఉద్యోగికి ప్రమోషన్ పైనా..

రాజకీయంలో ఏ నాయకుడికి అయిన వచ్చే ఎన్నికలు పరిగణలోకి తీసుకుంటారని.. ఉద్యోగి ఎవరైనా ప్రమోషన్ ఎప్పుడు వస్తుందని ఆశపడతారని.. ఈ రెండు నిజమే అయినప్పటికీ నా వరకు మాత్రం వచ్చే ఎన్నికల కంటే భవిష్యత్తు తరాలకు మంచి అభివృద్ధి చేసి ఇచ్చామా అనేది లక్ష్యం నిర్దేశించుకున్నానని  ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  నియోజకవర్గంలో నేను లేకపోయినప్పటికీ మంచి టీం నాకు ఉందని అది నా అదృష్టంగా భావిస్తున్నామని  పేర్కొన్నారు. నేను ఎక్కడ ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే మాత్రమే పనిచేస్తున్నానని తెలిపారు. అనవసరమైన ఆరోపణలు చేసుకుంటూ కొందరు కాలం గడుపుతున్నారని ఆ విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నేను ఎక్కడ ఉన్నా టీం సభ్యులు నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చిన అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.  సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకుపోతున్నారని స్పష్టం చేశారు. తక్కువ సమయంలోనే నియోజకవర్గానికి 1000 కోట్లు నిధులు రావడం జరిగిందని, ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ పారదర్శకంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. 

మాయ మాటలు కాదు... మంచి చేస్తున్నాం...

మాయమాటలు చెప్పి కాలం గడిపే పరిస్థితి లేదని ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అది చేశాం ఇది చేశామని గత ప్రభుత్వం లోని నేతలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రంలోని బాలికల కళాశాలలో కనీసం టాయిలెట్లు నిర్మించలేని దుస్థితిలో ఉండి గత ప్రభుత్వం మాయ మాటలు చెప్పి కాలం గడిపిందన్నారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటూ ఎక్కడ ఏ సమస్య ఉందో క్షుణ్ణంగా తెలుసుకుంటూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, ఎన్పీ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, మత్స్య శాఖ పర్సనల్ ఇంచార్జ్ గోనెల శ్రీనివాస్, బెనహర్ తదితరులు ఉన్నారు.