22 April, 2026 | 1:33 AM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

22-04-2026 12:00 AM

తాడ్వాయిలో భారతీయ కిసాన్ సంఘ్ నాయకుల ధర్నా

తాడ్వాయి, ఏప్రిల్ 21(విజయక్రాంతి): ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విట్టల్ రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ఎల్లారెడ్డి రోడ్డుపై మంగళవారం భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా విట్టల్ రెడ్డి మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బయట మార్కెట్‌లో దళారులు ఒక క్వింటాల్ మక్కలకు రూ. 1700 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఒక్కో క్వింటాల్‌కు రైతులు రూ.700 నష్టపోతున్నారని తెలిపారు. మక్కలు లేని చోట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఏం లాభం అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తాడ్వాయిలో మక్కలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. తాడ్వాయి సింగిల్ విండోలో ఇటీవల ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వెంటనే అవినీతి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల వద్ద తరుగు పేరుతో అధికారులు దోపిడీ చేశారని ఆరోపించారు. ఒక్కో క్వింటాల్‌కు రైతుల వద్ద రూ.70 వసూలు చేసి ఏం చేశారని ప్రశ్నించారు. రైతుల నుంచి మినహాయించుకున్న డబ్బులను జమ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సింగిల్ విండో వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ పార్టీ నాయకులు దేవి రెడ్డి విట్టల్ రెడ్డి, వెంకట్రావు, ప్రభాకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రాజిరెడ్డి, సంగరాజు తదితరులు పాల్గొన్నారు.