22 April, 2026 | 1:36 AM

కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య

22-04-2026 12:00 AM

పాపన్నపేట, ఏప్రిల్21: కుటుంబ కలహాలతో భార్య కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని పొడ్చన్ పల్లి తండాలో చోటు చేసుకుంది. ఏఎస్త్స్ర తుక్కయ్య కథనం ప్రకారం.. పొడ్చన్ పల్లి తండాకు చెందిన మాలోత్ కిషన్(60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం  సాగిస్తున్నాడు. తరచూ మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడు. మద్యం మత్తులో తరచూ ఇంట్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం రాత్రి సమయంలో కిషన్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు.

ఇంట్లో ఉన్న భార్య మాలి, కొడుకు వినోద్ తో గొడవ చోటు చేసుకుంది. కిషన్ ను అంతమొందిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని భార్య మాలి, కొడుకు వినోద్ లు కిషన్ ను కింద పడేసి చేతులతో బాగా కొట్టారు. మాలి కిషన్ కాళ్లు గట్టిగా పట్టుకోగా వినోద్ కిషన్ గొంతు నొక్కి హత్య చేసి ఇంటి ముందున్న నీటి తొట్టిలో పడేశారు. కొంత సేపటికి అటుగా వెళ్లిన స్థానికులు నీటి తొట్టిలో పడి ఉన్న కిషన్ ను గమనించి బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు.

కిషన్ మృతి పట్ల అనుమానం రావడంతో మాలి, వినోద్ లను నిలదీయగా హత్య చేసిన  విషయం తెలిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా హాస్పిటల్ కు తరలించారు. మృతుడి కూతురు లీలావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్త్స్ర తెలిపారు.