ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయండి
సూర్యాపేట రూరల్, ఆగస్టు 19: వచ్చే సెప్టెంబర్ 6, 7, 8 తేదీలలో కరీంనగర్లో నిర్వహించనున్న ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సెప్టెంబర్ 6న కరీంనగర్లో జరిగే భారీ కార్మిక ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై స్పష్టమైన అజెండాతో పోరాడే ఏకైక సంఘం ఏఐటీయూసీయేనని స్పష్టం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరిస్తూ తెచ్చిన నల్ల చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని, ఈ మహాసభల్లో భవిష్యత్ పోరాట దిశా నిర్దేశంపై చర్చించి తీర్మానాలు చేస్తామని తెలిపారు. కార్మికులకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు విధా నాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ, సింగరేణి సంస్థల పరిరక్షణకు ఏఐటీయూసీ ఎల్లప్పుడూ ముందుంటుందని, స్కీమ్ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో గౌరవ సలహాదారులు శ్యామల అశోక్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజారామ్, గౌరవ అధ్యక్షుడు దంతాల రాంబాబు, నాయకులు శ్యాంసుందర్, ఎన్. కవిత, త్రిపురం సుధాకర్ రెడ్డి, ఎస్. రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






