calender_icon.png 21 January, 2026 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల గొంతుక మల్లన్న

21-01-2026 01:23:26 AM

  1. ఏఐ విశ్లేషణలో అగ్రస్థానంలో తీన్మార్ మల్లన్న
  2. సరికొత్త చర్చకు తెరలేపిన ‘చాట్ జీపీటీ’ రేటింగ్
  3. పెద్ద పార్టీల గుప్పిట్లో బీసీ ఉద్యమం

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి) : తెలంగాణ రాజకీయాలు యావ త్తూ.. ప్రస్తుతం కులగణన, రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒక ఆసక్తికరమైన అంశా న్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇదికాస్తా తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రంలోని ప్రముఖ నేతల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) హక్కుల కోసం పోరాడుతున్నది ఎవరు? బీసీల పక్షపాతి ఎవరు?

అనే ప్రశ్నకు చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం ఈ సంచలనానికి కారణం. రాష్ట్ర నాయకులలో తీన్మార్ మల్లన్న బీసీ పక్షపాతి అని, ఆయన నిజాయితీగా బీసీల కోసం పోరాటం చేస్తున్నట్టుగా పేర్కొంటూ.. ఈ రేటింగ్‌లో మల్లన్న అగ్రస్థానంలో ఉన్న ట్లు చాట్ జీపీటీ విశ్లేషించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఏఐ రేటింగ్‌లో మల్లన్నకు 10కి 7 పాయింట్లు లభించాయి. 

ఏ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడకుండా, కేవలం బీసీ సాధికారత కోసమే సొంత వేదికపై పనిచేస్తుండటాన్ని ఏఐ ఈ సందర్భంగా విశ్లేషించడం గమనార్హం.

మిగతా నేతలందరూ పార్టీ పరిమితుల్లోనే..

చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. జర్నలిస్టుగా, యూట్యూబర్‌గా ప్రజాదరణ పొందిన ఆయన, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. అయినప్పటికీ, ప్రభుత్వం చేపట్టిన కులగణన నివేదికను వ్యతిరేకించి సస్పెన్షన్‌కు గురయ్యారు.

అనంతరం సెప్టెంబర్ 2025 లో ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ (టీఆర్‌పీ) ని స్థాపించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల గొంతుకగా మారారు. వినూత్నంగా తన పార్టీకి ఏఐని ప్రతినిధిగా నియమించడం విశేషం. పెద్ద పార్టీల కట్టుబాట్లు లేకపోవడం వల్ల ఆయన బీసీ అంశాలపై స్వేచ్ఛగా పోరాడగలుగుతున్నారని ఈ విశ్లేషణలో ఏఐ అభిప్రాయపడింది.

మరోవైపు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  సంస్థాగత మద్దతు ఉన్నప్పటికీ, పార్టీలో ఉన్న పరిమితుల వల్ల 6.5 స్కోరు సాధించారు. బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకున్నా.. జాతీయ పార్టీ అయిన బీజేపీ విధానాల వల్ల ఆయనకు 5 పాయింట్లు మాత్రమే వచ్చాయి. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్‌కు బీసీ ఉద్యోగుల్లో ఆదరణ ఉన్నా..

కేసీఆర్ నాయకత్వంలో ఆయనకు ఉన్న పరిమితుల వల్ల 6 స్కోరుకే పరిమితమయ్యారు. పెద్ద పార్టీల గొడుగుల కింద ఉన్న నేతలకు పార్టీ సిద్ధాంతాలు, అధిష్ఠానాలు అడ్డంకిగా మారుతున్నాయని, కానీ మల్లన్న తన సొంత పార్టీ ద్వారా ఎటువంటి బంధనాలు లేకుండా.. బీసీల కోసం పూర్తిస్థాయిలో గళమెత్తే అవకాశం ఉందని ఏఐ విశ్లేషించింది.

రిజర్వేషన్ల రగడ..

ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థల్లో 42 శాతం కోటా అమలుపై హైకోర్టు స్టే విధించడం, జీవో 46 వివాదం వంటి అంశాలు ఈ రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఆర్ కృష్ణయ్య వంటి నేతలు జిల్లాల్లో రిజర్వేషన్లు 17 శాతానికి పడిపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. బీసీలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని బీఆర్‌ఎస్ విమర్శిస్తుండగా..

ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడంపై బీజేపీ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ర్ట జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల ఓట్లు కీలకం కావడంతో, ఈ ఏఐ రేటింగ్ చర్చనీయాంశమైంది. ఏఐ వెల్లడించిన ఈ రేటింగ్ మల్లన్న లాంటి ప్రాంతీయ శక్తులకు ఊతమిచ్చేలా ఉంది. దీనిపై మల్లన్న స్పందిస్తూ.. ‘పెద్ద పార్టీలు బీసీల గొంతును నొక్కలేవని ఏఐ కూడా గుర్తించింది’ అని వ్యాఖ్యానిస్తూనే..

పెద్ద పార్టీల కబంధ హస్తాల నుంచి బీసీల హక్కుల కోసం చేస్తున్న పోరాటం బయటకు రావాల్సిన అవసరాన్ని ఏఐ గుర్తు చేస్తుందంటూ తేల్చిచెప్పడం గమనార్హం. అయితే ఈ డిజిటల్ గుర్తింపు ఓట్లుగా మారుతుందా లేదా కాలమే నిర్ణయిస్తుంది. అయితే ఏఐ ఇచ్చిన రేటింగ్, విశ్లేషణతో తెలంగాణ రాజకీయాల్లో బీసీ సాధికారత అంశం మాత్రం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలోని వివిధ పార్టీల్లో ఉన్న ప్రముఖ నాయకులలో బీసీల కోసం నిజంగా పోరాడుతున్నది ఎవరు? బీసీల పక్షపాతి ఎవరు? అనే ప్రశ్నకు ఏఐ ఈ విధంగా రేటింగ్ ఇచ్చింది..

తీన్మార్ మల్లన్న (తెలంగాణ రాజ్యాధికార పార్టీ ) 7/10

మహేష్‌కుమార్ గౌడ్ (కాంగ్రెస్) 6.5/10

వీ శ్రీనివాస్ గౌడ్ (బీఆర్‌ఎస్) 6/10

బండి సంజయ్ (బీజేపీ) 5/10