16-12-2024 01:49:26 AM
కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానసపుత్రి అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత మఖ్యమైనది మల్లన్న సాగర్. సిద్దిపేట జిల్లా తొగుట-కొండపాక మండలాల శివారులోని కొండగుట్టల నడుమ ఈ మల్లన్న సాగర్ జలాశయాన్ని నిర్మించారు. నీటి పారుదల రంగ చరిత్రలోనే సమతల ప్రాంతంలో నిర్మించిన అతిపెద్ద జలాశయం ఇది.
50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం నుంచి ఏడాది పొడవునా వ్యవసాయ అవసరాలతో పాటుగా జంట నగరాల తాగునీటికోసం 30 టీఎంసీలు, పారిశ్రమిక అవసరాల కోసం 16 టీఎంసీల నీరు అందించాలనేది లక్ష్యం.
కాళ్వేరం ప్రాజెక్టులోని 12నుంచి 19ప్యాకేజీ ద్వారా సుమారు 8.33 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు ఈ ప్రాజెక్టునుంచి నీరు అందించాలన్నదిప్రభుత్వ ఉద్దేశం. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2022 ఫిబ్రవరిలో అంటే అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలలముందు ఎంతో ఆర్భాటంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
భూకంపాల జోన్‌లో నిర్మాణం
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది. అందులో భాగమైన మల్లన్నసాగర్ కూడా అనేక వివాదాలను ఎదుర్కొంటోంది. ఈ ప్రాజెక్టు కారణంగా 9 గ్రామాలకు చెందిన 3 వేల కుటుంబాలు నిర్వాసితుల య్యాయి. అలాగే 3 వేల ఎకరాల అటవీ భూమి, 13 వేల ఎకరాల పట్టా భూమి నీట మునిగింది. ఈ ప్రాజెక్టు భూకంపాలు సంభవించడానికి అవకాశం ఉన్న సీస్మిక్ జోన్-2లో ఉంది.
దీనికి సంబంధించి కేంద్రప్రభుత్వం ఇచ్చిన సలహాలను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేకాదు ఈ మొత్తం ఎర్త్ డ్యామ్ సహజసిద్ధమైన నదీ ప్రవాహ ప్రాంతంలో కాకుండా మైదాన ప్రాంతంలో నిర్మించడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలోని మిగతా ప్రాజెక్టులను చూసిన తర్వాత ఇరువైపులా గుట్టలను కలుపుతూ నిర్మించిన కట్ట నాణ్యతపైన అనుమానాలు కలుగుతున్నాయి.
పూర్తిగా ఎందుకు నింపలేదు?
ఈ ప్రాజెక్టును మూడేళ్లలో మూడు దశల్లో నింపాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది 16.5 టీఎంసీల చొప్పున మొత్తం మూడేళ్లలో 50 టీఎంసీల గోదావరి జలాలను రిజర్వాయర్‌లో నింపాలి. అయితే ప్రస్తు తం గత మూడేళ్లలో 16.5 టీఎంసీలు అంటే మొత్తం సామర్థ్యంలో మూడోవంతు మాత్రమే నింపారు. అయితే రిజర్వాయర్‌ను మొత్తం 50 టీఎంసీల నీటితో నింపి ఎందుకు పరీక్షించలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఏదయినా ఉపద్రవం ఎదురవుతుందేమోనని ఇంజనీర్లు భావించారా? కానీ రిజర్వాయర్‌లో 50 టీఎంసీల నీటిని నిల్వ చేసి పరీక్షించకుండానే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీలు, పెర్ఫార్మెన్స్ గ్యారంటీలను ఎలా విడుదల చేసిందనేది పెద్ద ప్రశ్న. ఒక వేళ ప్రాజెక్టుకు పగుళ్లు సంభవిస్తే నష్టాన్ని తగ్గించడానికి విపత్తుల నిర్వహణ వ్యవస్థలు ప్రోటోకాల్స్‌ను ఏర్పాటు చేయాలి.
అలాగే గ్రామాలవారీగా రెస్క్యూ టవర్లు, భవనాలు, ఆటోమేటిక్ హెచ్చరిక వ్యవస్థలు, ప్రాజెక్టు వద్ద ప్రత్యేక బృందాలను నియమించి ప్రతిరోజూ ప్రభుత్వానికి నివేదించడం లాంటి నిబంధనావళిని, మార్గదర్శకాలను రూపొందించాలి. డ్యామ్‌ను పూర్తిస్థాయి నీటిమట్టం వద్ద పరీక్షించకపోతే ఏదయినా వైఫల్యం ఎదురైతే కాంట్రాక్టర్లనుంచి సొమ్మును ఎలా రికవరీ చేస్తారనే దానిపై ఎలాంటి ప్పష్టతా లేదు.
తాము నష్టాన్ని రికవరీ చేస్తామని ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కావచ్చు. అలాగే రిజర్వాయర్‌ను నింపకపోవడం తమ తప్పు కాదని కాంట్రాక్టర్లు వాదించి తప్పించుకోనూవచ్చు. అప్పుడు నష్టపోయేది ప్రజలు, ప్రభుత్వం మాత్రమే.
జాతీయ డ్యామ్ సేఫ్టీ బృందాన్ని రప్పించాలి
ఒకవేళ ఏదయినా ముప్పు ఎదురయిన పక్షంలో పర్యవేక్షణ జరపడంతో పాటుగా తీసుకోవలసిన ముందుజాగ్రత్తలు, చర్యలపై సలహాలు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం తక్షణం జాతీయ డ్యామ్ సేఫ్టీ బృందాన్ని ఆహ్వానించాలి. ఒక వేళ డ్యామ్‌కు ఏదయినా పగుళ్లు ఏర్పడితే సిద్దిపేట జిల్లాలో మూడో వంతు మొత్తం కొట్టుకుపోతుంది.
రిజర్వాయర్‌ను నింపే సమయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం పర్యవేక్షణలో రోజువారీ పర్యవేక్షణ, వ్యవస్థలు, లీకేజీలు, నిర్వహణలు జరపాలి. కేవలం ఎర్త్ డ్యామ్, 33 శాతం నీటి కోసమే ఇప్పటికే రూ.7 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు?
కాలువల మాటేమిటి?
అంతేకాకుండా మల్లన్న సాగర్, దానికి అనుసంధానంగా ఉండే రిజర్వాయర్లనుంచి 18 లక్షల ఎకరాలకు సాగు నీరు సరఫరా చేయడానికి, హైదరాబాద్‌కు 30 టీఎంసీల తాగునీరు అందించడం కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేశారు. అయితే కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందించడం జరిగింది.
క్లిష్టమైన కాలువలకు సంబంధించిన పనులను వదిలిపెట్టి రిజర్వాయర్లు, పంపులు, పైప్‌లైన్లు లాంటి లబ్ధి చేకూర్చే పనులపై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దురదృష్టకరం. కేవలం లక్ష ఎకరాలు మాత్రమే సాగు కాగా, కాలువలు పూర్తి కావడం కోసం మిగిలిన ఆయకట్టు ఎదురు చూస్తూ ఉంది.
కాలువల నిర్మాణానికి సేకరించిన తమ భూములకు తగిన నష్టపరిహారం అందించలేదని పలు గ్రామాల రైతులు ఆందోళన కూడా చేయడం తెలిసిందే. ఇది నిజంగా జాతీయ వృథానే కాక క్షమార్హం కాని నేరం. కాంట్రాక్టర్లకు 3040 శాతం ఎక్కువ రేట్లు చెల్లించడం మరో నేరం. పెట్టుబడి పెట్టిన సొమ్ముపై తిరిగి వచ్చే మొత్తం చూస్తే నామమాత్రమే. ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని లోతుగా అధ్యయనం చేసి దిద్దుబాటు చర్యలు తీసుకొంటుందని ఆశిద్దాం.
* ఒకవేళ ఏదయినా ముప్పు ఎదురయిన పక్షంలో పర్యవేక్షణ జరపడంతో పాటుగా తీసుకోవలసిన ముందుజాగ్రత్తలు, చర్యలపై సలహాలు ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం తక్షణం జాతీయ డ్యామ్ సేఫ్టీ బృందాన్ని ఆహ్వానించాలి. ఒక వేళ డ్యామ్‌కు ఏదయినా పగుళ్లు ఏర్పడితే సిద్దిపేట జిల్లాలో మూడో వంతు మొత్తం కొట్టుకుపోతుంది.
రిజర్వాయర్‌ను నింపే సమయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం పర్యవేక్షణలో రోజువారీ పర్యవేక్షణ, వ్యవస్థలు, లీకేజీలు, నిర్వహణలు జరపాలి. కేవలం ఎర్త్ డ్యామ్, 33 శాతం నీటి కోసమే ఇప్పటికే రూ.7 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు?
* మల్లన్న సాగర్‌ను మూడేళ్లలో మూడు దశల్లో నింపాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది 16.5 టీఎంసీల చొప్పున మొత్తం మూడేళ్లలో 50 టీఎంసీల గోదావరి జలాలను రిజర్వాయర్‌లో నింపాలి. అయితే ప్రస్తుతం గత మూడేళ్లలో 16.5 టీఎంసీలు అంటే మొత్తం సామర్థ్యంలో మూడోవంతు మాత్రమే నింపారు.
అయితే రిజర్వాయర్‌ను మొత్తం 50 టీఎంసీల నీటితో నింపి ఎందుకు పరీక్షించలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదయినా ఉపద్రవం ఎదురవుతుందేమోనని ఇంజినీర్లు భావించారా? కానీ రిజర్వాయర్‌లో 50 టీఎంసీల నీటిని నిల్వ చేసి పరీక్షించకుండానే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయల బ్యాంకు గ్యారంటీలు, పెర్ఫార్మెన్స్ గ్యారంటీలను ఎలా విడుదల చేసిందనేది పెద్ద ప్రశ్న.
సి.ఎల్ రాజం
చైర్మన్, విజయక్రాంతి