15 August, 2026 | 4:54 AM

మల్లారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

25-05-2024 12:45 AM

భూవివాదంలో ఉపశమనానికి ఆదేశాలివ్వలేమని స్పష్టం

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): ఓ భూవివాదంలో మాజీమంత్రి మల్లారెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. రంగారెడ్డి జిల్లా కుత్భుల్లాపూర్ మండలం జీడిమెట్ల గ్రామం సర్వే నంబర్ 82, 83లోని రెండున్నర ఎకరాల స్థల వివాదంలో మల్లారెడ్డి ఉపశమనం కోరగా న్యాయస్థానం నిరాకరించింది. జీడిమెట్లలోని వివాదస్పద భూమికి సంబంధించి సివిల్ కోర్టుల్లో అనేక పిటిషన్లు విచారణలో ఉన్నందున తాము ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

జీడిమెట్ల స్థలంలో ఫెన్సింగ్ కూలగొట్టిన విషయంలో మల్లారెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డిపైనా కేసు నమోదు చేశారు. ఈ భూమి విషయంలో తహసీల్దార్‌తోపాటు పోలీసులు జోక్యం చేసుకోకుండా ఉండేలా మల్లారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2011లో పిటిషనర్లు ఆ భూమిని కొనుగోలు చేశారని వారి తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కుత్భుల్లాపూర్ తహసీల్దార్ మే 18న ఈ భూమిని సర్వే చేయడానికి పోలీసులతో సహా వచ్చారన్నారు. ఆ రెండున్నర ఎకరాలు పిటిషనర్లకు చెందదని పేర్కొంటూ శ్రీనివాసరెడ్డి అనే వ్యాపారి కొందరితో కలిసి అప్పటికే ఉన్న షెడ్లను కూలగొట్టారని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు వివాదస్పద భూమికి సంబంధించిన రికార్డులను కోర్టు ముందు ఉంచాలని ప్రతివాదులను ఆదేశించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను వారానికి వాయిదా వేసింది.