జూన్ 20 నుంచి పాలీసెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో నూతన ప్రవేశాలకు సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 20 నుంచి తొలివిడత కౌన్సెలింగ్ చేపట్టనుండగా, 22 నుంచి తొలివిడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించింది. తొలివిడత సీట్లను జూన్ 30న కేటాయిస్తారు. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 7న ప్రారంభించనుండగా, 9న వెబ్ ఆప్షన్లు, 13న సీట్ల కేటాయింపు ఉంటుంది.
సీటు పొందిన విద్యార్థులు జూలై 15 వరకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదే నెల 16వ తేదీలోపు కళాశాలల్లో ప్రత్యక్షంగా రిపోర్టింగ్ చేయాలి. జూలై 21 నుంచి ఇంటర్నల్ స్లుడింగ్‌కు అవకాశం ఇస్తారు. జూలై 24వ తేదీలోపు సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగనుంది. ఇక జూలై 23న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. అదేనెల 30 వరకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సాం కేతిక విద్యాశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం షెడ్యూల్‌లో వివరించారు.
పాలీసెట్ పరీక్షకు 89.23% మంది హాజరు
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): పాలీసెట్-2024 పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరగిందని కార్యదర్శి పుల్లయ్య తెలిపారు. మూడేళ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు, వ్యవసాయ, ఉద్యాన, వెట ర్నరీ డిప్లొమా కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికిగానూ ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 259 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 89.23 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో బాలురు 46,313 (89.72 శాతం), బాలికలు 36,496 (88.60 శాతం) మంది ఉన్నారు.






