13-10-2025 06:18:52 PM
నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని మృతదేహం కనిపించడం కలకలంగా మారింది. పాత ఎస్బిహెచ్ బ్యాంకు ఏటీఎం వద్ద అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా మునగాల మండలం గణపవరం గ్రామానికి చెందిన పగిళ్ల శ్రీనివాస్(34)గా గుర్తించారు. ఆదివారం కేతపల్లి మండలం చికటిగూడెం గ్రామానికి దినాలకు వచ్చాడు.
ఈ క్రమంలో బాగా మధ్యం సేవించి కిందపడటంతో చుట్టుపక్క ప్రజలు 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా వారు నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తాగిన మైకంలో వైద్యానికి సహకరించకుండా ఆసుపత్రి నుంచి బయటకు వెళ్ళాడు. ఈ క్రమంలో తాగిన మైకంలో మృతి చెందాడు. భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు నకిరేకల్ ఎస్సై లచ్చిరెడ్డి తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి వారి బంధువులకు అప్పచెప్పాడం జరిగిందని ఆయన తెలిపారు.