ఆర్టీసీ అధికారుల నిర్వాకం!
వేసవిలో మరచి.. వర్షాల పడుతుంటే గ్రీన్‌నెట్స్
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏర్పాటు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (విజయక్రాంతి): నగరంలో ఆర్టీసీ అధికారులు చేసిన నిర్వాకంపై పలువురు విమర్శలు సంధిస్తున్నారు. ఈ ఏడాది ఎండాకాలం ప్రారంభం నుంచే భానుడు భగభగ మండుతున్నాడు. ఇటీవల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినప్పటికీ తీవ్ర ఉక్కపోత, వడగాలులతో మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకి రావడానికి కూడా జంకుతున్నారు. ఈ ఎండల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వివిధ పనుల నిమిత్తం బయటకి వచ్చిన ప్రజలు నగరంలోని ట్రాఫిక్ కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ పడిందంటే చాలు.. ఎండ వేడిమి భరించలేక నరకం అనుభవిస్తున్నారు. నగరంలోని పలు సిగ్నళ్ల వద్ద వేచి ఉండడం, అవి దాటడానికి 2 నుంచి 5 నిమిషాలు సమయం పడుతుండడంతో ఎండకు తాళలేక పోతున్నారు. ఈ క్రమంలో వాహనదారులకు కాస్త ఉపశమనం కల్పించడానికి టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో హిమయత్ నగర్ లిబర్టీ సిగ్నల్, ప్యాట్నీ సెంటర్ వద్ద గ్రీన్ నెట్స్‌ను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులకు ఎండ నుంచి కాస్త ఉపశమనం కలుగుతోందని ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎండలు మండుతున్నపుడే లేవు కానీ.. వానలు పడుతుంటే ?
నగరంలో వివిధ సిగ్నల్స్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్స్‌ను పలువురు అభినందిస్తుండగా.. మరి కొందరు విమర్శిస్తున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలు మండుతున్న సమయంలో గ్రీన్ నెట్స్ ఏర్పాటు చేయని ఆర్టీసీ అధికారులు, వారం రోజులుగా వర్షాలు పడుతున్న వేళ, ఉష్ణోగ్రతలు తగ్గుతున్న సమయంలో ఏర్పాటు చేయడంపై పలువురు వాహనదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో పది రోజుల్లో వర్షాకాలం రాబోతుందని, ఇప్పుడు ఏర్పాటు చేసిన గ్రీన్ నెట్స్‌ను రెండు నెలల క్రితం ఏర్పాటు చేసి ఉంటే, ఎంతో ఉపయోగకరంగా ఉండేదని చెబుతున్నారు.






