8 April, 2026 | 2:19 AM

ఉపాధ్యాయుల ఉద్యమబాట

08-04-2026 12:00 AM

తెలంగాణలో ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టారు. పదో తరగతి వార్షిక పరీక్షల పేపర్ల వాల్యూయేషన్ క్యాంపులలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ముఖ్యంగా తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీటీజేఏసీ) యూఎస్ పిస్, జాక్టో సంయుక్త ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. 2024 విద్యా సంవత్సరంలో నిర్వహించిన స్పాట్ వాల్యూయేషన్‌కు సంబంధించిన రుసుము లను ఇంతవరకు ఇవ్వలేదని, 2025 రెండో దఫా స్పాట్ వాల్యూయేషన్ డబ్బులు చివరి రోజు ఇచ్చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా స్పాట్ వాల్యూయేషన్ రుసుములను 50 శాతం పెంచాలని కోరుతున్నారు. గతంలో జనాభా లెక్కల విధులు నిర్వహించినవారికి ఇంతవరకు డబ్బులు రాలేదని, వాటిని వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. రాష్ర్టంలోని అన్ని స్పాట్ వాల్యూయేషన్ క్యాంపుల లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఒంటి గంట ముప్పు నిమిషాల వరకు అర్ధ గంట పాటు శాంతియుతంగా ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహి స్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటు న్న అనేక సమస్యలకు పరిష్కారం లభించేదెప్పుడు? అన్న ప్రశ్న మరోసారి ఉదయిస్తున్నది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని, 317 జీవో బాధితులకు సొంత జిల్లాలకు పంపాలని స్థానికులు, స్థానికేతరులుగా మారాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.

భాషోపాధ్యాయులకు ఆర్డినెన్స్ రద్దు చేసి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పరిగణించాలని, భాషోపాధ్యాయులు ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహించి ప్రాథమిక పాఠశాల వేతనాలు తీసుకొని శ్రమదోపిడీకి గురయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలలో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయులకు మూడు దశాబ్దాలు గడిచినా పదోన్నతులు లేవని చెబుతున్నారు. నగదు రహిత హెల్త్‌కార్డుల కోసం డబ్బులు కట్టడానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు అంగీకరించినా పెండింగ్‌లో పెట్టడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదంటున్నారు.

నగదు రహిత హెల్త్‌కార్డుల విషయం మూడు అడుగుల ముందుకు ఆరు అడుగుల వెనుకకు పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను ఇవ్వాలని, పీఆర్సీ గడువు ముగిసినప్పటికి దాని ప్రస్తావన తేవడం లేదని, రెండవ పీఆర్సీ వెంటనే ప్రకటించాలని కోరుతున్నారు. డైట్ కళాశాలల్లో, బీఎడ్ కళాశాలల్లో, ఐసీఎస్‌ఈ, ఎస్సీ ఈఆర్టీఈలో ఖాళీగా ఉన్న సీనియర్ లెక్చరర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసి నాణ్యమైన విద్య అందించాలని కోరుతున్నారు.

సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని హైకోర్టు  ఉత్తర్వులు ఇచ్చినా, సీనియర్ ఉపాధ్యాయుల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించినా ఇప్పటివరకు వారికి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు జారీకాలేదు. ఈ నేపథ్యంలో టెట్ ఉంటుందా? ఉండదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం ‘ఉద్యమాలే శరణ్యం లేకుంటే అరణ్యం’ అంటూ ఉపాధ్యాయులు సంఘాలకతీతంగా ఉద్యమాల బాటపట్టారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది.

- డాక్టర్ ఎస్.విజయ భాస్కర్, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ 

(టీఆర్‌టీఎఫ్)ప్రధాన కార్యదర్శి, సెల్: 9290826988