ప్రజాపాలన కాదు.. మోసగాళ్ల పాలన
మన్నె గోవర్ధన్ రెడ్డి
ఖైరతాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలన కాదు మోసగాళ్ల పాలన అని బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ డివిజనులోని గురుబ్రహ్మనగర్ రోడ్డు నెంబరు 69లో సమస్యలపై సమరం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నరు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ లో లక్ష ఇండ్లను కట్టిస్తామని కాంగ్రెస్ మంత్రి ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. అంతకంటే ముందు జూబ్లీహిల్స్ డివిజనులోని గురుబ్రహ్మనగర్ లో 20 ఏళ్లుగా గుడిసెల్లో మగ్గిపోతున్న పేదలకు ఇండ్లను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజలను మోసం చేయడమే తప్ప వారికి మేలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వంలో కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డివిజన్ బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వెంకీ ముదిరాజ్, ఈశ్వరయ్య, వెంకటస్వామి, రామచందర్, రాములు, కారెడ్డి సుజాత శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, రాము, సంతు ముదిరాజ్, నరసింహ, అశోక్, మల్లేశ్, నిరంజన్, కామేశ్ తదితరులు పాల్గొన్నారు.






