calender_icon.png 17 July, 2025 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

11-05-2024 12:11:56 AM

12 మంది మావోయిస్టులు మృతి

మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్టు గుర్తింపు

మావోయిస్టు అగ్రనేతలు సమావేశమైనట్టు బలగాలకు సమాచారం

చర్ల (విజయక్రాంతి) మే 10:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతమైన పీడియా అడవుల్లో శుక్రవారం భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో 12 మంది మవోయిస్టులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో మావోయిస్టు కీలక నాయకులు ఉన్నారని సమాచారం. శుక్రవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనాయకులు ఉన్నారని భద్రతా బలగాలకు సమాచారం అందడంతో పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. పకడ్బందీగా అక్కడికి చేరుకున్న బలగాలు ఇరు వైపుల నుంచి కాల్పులు జరిపారు. మావోయిస్టు కమాండర్ లింగ, పాపారావు సహా పెద్ద నాయకులు పెడియా అడవుల్లో సమావేశమయ్యారని సమాచారం.

చుట్టుముట్టిన 1,200 మంది సైనికులు

బీఆర్‌జీ, ఎస్టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ కోబ్రా బెటాలియన్ సహా 1,200 మందికిపైగా బలగాలు మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్ వెల్లడించారు. ఎదురు కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ చౌదరితో పాటు ముగ్గురు సైనికులు గాయపడ్డారని తెలిపారు. గాయపడిన జవాన్లను హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్ తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి 5 ఏకే 47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.