calender_icon.png 18 July, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియా కూటమిలో జోష్!

11-05-2024 12:17:17 AM

కేజ్రీవాల్‌కు బెయిల్‌పై హర్షాతిరేకాలు

ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ యూపీలో ఆప్ ప్రభావం

కేజ్రీవాల్ అరెస్టుతో ఆయనపై పెరిగిన సింపతీ?

ప్రచారానికి కేజ్రీవాల్‌కు రెండు వారాలే సమయం 

పంజాబ్, ఢిల్లీకే పరిమితమవుతారా? 

ఇండియా కూటమి అభ్యర్థులకూ ప్రచారం చేస్తారా?

తక్కువ సమయంలో ఎంతమేర ప్రభావం ఉంటుందో?

న్యూఢిల్లీ, మే 10: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఆయనకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మధ్యంతర బెయిల్ వచ్చిన మొదటి వ్యక్తి కేజ్రీవాలే. పైగా ఇంత తక్కువ సమయంలో బయటకు వచ్చింది కూడా అయనొక్కరే. ఆయన బయటకు రావడంతో ఆప్‌తో పాటు ఇండియా కూటమికి ఊరట లభించినట్టయింది. అయి తే ఆయన ప్రచారం చేయడంతో ఆప్, ఇండియా కూటమికి ఏ మేరకు లాభం చేకూరుతుందనే చర్చ జరుగుతోంది. పంజాబ్‌లో 13 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. అలాగే ఢిల్లీలో ఏడు సీట్లు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఆప్ అధికారంలో ఉంది. అయితే పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ జతకట్టలేదు. దీంతో దాదాపు అన్ని స్థానాల్లో వేర్వేరుగా అభ్యర్థులను బరిలో నిలిపారు. దీంతో అక్కడ కాంగ్రెస్, ఆప్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. అయితే ఢిల్లీలో మాత్రం ఈ రెండు పార్టీలు జతకట్టి ఉమ్మడిగా బీజేపీపై పోరాడుతున్నాయి. కేజ్రీవాల్ అరెస్టుతో పంజాబ్‌లో కూడా కాంగ్రెస్ ఆప్‌నకు మద్దతు ఇస్తోంది. రెండు పార్టీలు కలిపి పంజాబ్‌లో 13 సీట్లు గెలుచుకుంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక ఢిల్లీలో ఇండియా కూటమి 7 సీట్లకు ఏడు సీట్లు గెలుచుకుంటుందని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కేజ్రీవాల్‌కు మద్దతు పెరుగుతోందా?

కేజ్రీవాల్ అరెస్టుతో ఢిల్లీలో ఆయనపై సింపతీ పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ, పశ్చిమ యూపీ, పంజాబ్, హరియాణాలోని పలు ప్రాంతాల్లో ఆప్ ప్రభావం భారీ స్థాయిలోనే ఉంటుంది. అయితే కేజ్రీవాల్ అరెస్టుతో న్యూట్రల్‌గా ఉన్న ఓటర్లు కూడా ఆప్ వైపు మొగ్గు చూపుతున్నారని అనుకుంటున్నారు. అయితే కేజ్రీవాల్ ప్రచారం చేసుకోవడానికి రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో ఢిల్లీ, పంజాబ్‌లో మాత్రమే ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారా? లేక ఇండియా కూటమి అభ్యర్థుల తరఫున కూడా ఆయన ప్రచారం చేస్తారా అనేది వేచి చూడాలి. అయితే పంజాబ్‌లో ప్రచారం చేస్తే.. కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తారా..? లేక ఆప్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారా అంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. అయితే ఎవరికోసం ప్రచారం చేసినా.. ఇంత తక్కువ సమయంలో కేజ్రీవాల్ ఏ మేరకు ప్రభావం చూపుతారనేది వేచి చూడాల్సిందే. 

కవితకు కూడా బెయిల్ వచ్చేనా?

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసుకునేందుకు వీలుగా బెయిల్ ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కారణాలతో ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం పిటిషన్ వేస్తే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. అయినా కూడా గురువారం ఢిల్లీ హైకోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరి కేజ్రీవాల్‌కు ఇచ్చినట్టే కవితకు కూడా బెయిల్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.