24-11-2025 01:15:50 AM
సీఈఓ పండరిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
ఆదిలాబాద్ మార్కెట్‌లో ఘటన
ఆదిలాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి) : మద్యం మత్తులో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఓ అధికారి హల్చల్ చేసిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఓ యువరైతుని కాలర్ పట్టుకుని దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా సీరియస్ అయ్యారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కె ట్ యార్డులో సీఈఓ గా పని చేస్తున్న పండ రి శుక్రవారం రాత్రి మద్యం మత్తులో హం గామా సృష్టిస్తూ పలు రైతులతో దురుసుగా వ్యవహరించాడు.
రైతులు పత్తి బండ్లను లోడింగ్ అన్లోడింగ్ చేస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన సీఈఓ పండరీ మద్యం మత్తులో కొంత మంది రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హంగామా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సంద మహేష్ అనే యువ రైతు అక్కడికి వెళ్ళి..ఆపే ప్రయత్నం చేయగా..ఈ మార్కెట్ అంతా నాదే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ.. ఆ రైతు కాలర్ పట్టుకొని అతినిపై దాడి చేసినట్లు బాధిత రైతు వాపోయాడు.
ఈ తతంగమంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. వెంటనే బాధిత రైతు 100కు ఫోన్ చేయగా అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు అధికారి కి బ్రీత్ అనలైజర్ మిషన్ తో పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు నిర్ధారించారు. దీనిపై బాధిత రైతు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా ఘటనపై కలెక్టర్ సీరియస్ అయినట్లు తెలిసింది.
సీఈఓ పండరిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే మార్కెట్‌కు పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతులపై అధికారి పండరి మద్యం మత్తులో దాడి చేయడాన్నీ పలు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తెలంగాణ జాగృతి నాయకులు వేణుగోపాల్ యాదవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ యువరైతుపై దాడికి పాల్పడిన సీఈఓ పండరిపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు.
అధిక వర్షాలు, తేమ శాతంతో ఇప్పటికే రైతులు ఇబ్బందులు పడుతుంటే, ఇప్పుడు అధికారుల వ్యవహారంతో అన్నదాతలు మరింత కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోవైపు మద్యం మత్తులో రైతు కాలర్ పట్టుకుని దాడికి యత్నించిన సీఈఓ పండరిని వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని తెలంగాణ రాజ్యాధికారం పార్టీ జిల్లా ప్రధా న కార్యదర్శి తాళ్ళ రవీందర్ డిమాండ్ చేశా రు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కా కుండా చూడాలని అధికారులను కోరారు.