13 March, 2026 | 4:37 AM

లెబనాన్‌పై భారీ వైమానిక దాడి

13-03-2026 12:26 AM

బీరుట్‌లోని రామ్లెట్ అల్ ఖైదా వద్ద ఘటన

సముద్రతీర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ బాంబుల మోత

20 మంది మృతి, 31 మందికి గాయాలు

లెబనాన్‌లో ఇప్పటి వరకు 634 మంది మృతి

బీరుట్, మార్చి 12: అమెరికా ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధం ఉధృతం అవుతోంది. గురువారం లెబనాన్ రాజధాని బీరుట్ సముద్రతీర ప్రాంతమైన రామ్లెట్ అల్‌ఖైదా వద్ద ఇజ్రాయెల్ భారీ వైమానికదాడి జరిపింది. టైర్ జిల్లాలోని బుర్జ్ షమాలి పట్టణంలో, అరమౌన్ పట్ట ణం, బింట్ జుబైల్ జిల్లాలో, మఆరాకా -టైర్ కూడలిలో, బల్‌బెక్ జిల్లాలోని షాత్ పట్టణంపై జరిగిన దాడుల్లో కనీసం 20 మంది మృతి చెందారు. 31 మంది గాయపడ్డారు. ఈ మేరకు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

బాంబు దాడుల కారణంగా ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు టెంట్లలో నివసిస్తున్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రజలు టెంట్లలో నిద్రిస్తున్న సమయంలో యుద్ధ విమానాల గర్జన వినిపించిందని, కొద్దిసేపటికే రెండు భారీ పేలుళ్లు సంభవించాయని వారు చెప్పారు. ఇలాంటి దాడుల ను ‘కచ్చిత లక్ష్యాలపై దాడులు’గా ఇజ్రాయెల్ పేర్కొంటున్నప్పటికీ, ఈ దాడిలో ఎక్కువగా పౌరులే ప్రాణాలు కోల్పోయారని సమాచారం. దక్షిణ లెబనాన్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి.

అరమౌన్ పట్టణంపై జరిగిన దాడిలో ముగ్గురు మృతి చెందారు. ఒక చిన్నారి గాయపడింది. బింట్ జుబైల్ జిల్లాలోని డెయిర్ అంతార్ పట్టణంపై జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు. మఆరాకా -టైర్‌కూడలిలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంపై దాడి జరగడంతో మరో ఇద్దరు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి రక్షణ సిబ్బంది శ్రమిస్తున్నారు.

అంతకుముందు టైర్‌జిల్లాలోని బుర్జ్ షమా లి పట్టణంలో జరిగిన దాడిలో ఒక తల్లి, ఆమె ముగ్గురు కుమారులు ప్రాణాలు కోల్పోయారు. బల్‌బెక్ జిల్లాలోని షాత్ పట్టణంపై జరిగిన దాడిలో మరో 8 మంది మృతి చెందారు. ఫిబ్రవరి 28 నుంచి కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్ లో ఇప్పటివరకు కనీసం 634 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ ఆరోగ్య అధికారులు వెల్లడించారు. ఈ దాడులతో లెబనాన్ సరిహద్దులో యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

బాగ్దాద్ సమీపంలో దాడి

బాగ్దాద్ సమీపంలోని పీఎంఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని ఇజ్రాయెల్ తాకింది. బాగ్దాద్‌కు నైరుతి దిశలో ఉన్న పాపులర్ మొబిలై జేషన్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయం ఉన్న క్యాంప్ సక్న్రు లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి జరిగిందని ఇరాకీ భద్రతా వర్గాలు తెలిపాయి. ఇరాన్- సమన్వయ పారామిలిటరీ గ్రూపులు ఉపయోగించే స్థావరంపై ఈ దాడి చేసింది.