4 May, 2026 | 1:19 AM

కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం

04-05-2026 12:00 AM
  1.   23 దుకాణాలు దగ్ధం
  2. రూ.కోటి ఆస్తి నష్టం 
  3. షార్ట్ సర్క్యూట్‌తో పేలిన ఎల్‌పీజీ సిలిండర్ 

కామారెడ్డి, మే 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ పక్కన గల పాత బస్టాండ్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఒంటిగంటకు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 దుకాణాలు దగ్ధం అయ్యాయి. పాత బస్టాండ్‌లోని అఫ్జల్ హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఎల్‌పీజీ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. హోటల్ పక్కన ఉన్న జ్యూస్ సెంటర్లు, సెలూన్ షాప్, పూల దుకాణాలు, పండ్ల దుకాణాలు మొత్తం 23 దుకాణలకు మంటలు అంటుకున్నాయి.

ఇందులో 18 దుకాణాలు పూర్తిగా కాలిపోగా, 5 పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తం కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు అగ్నిమాపక శాఖ అధికారులు రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పారు. రాష్ట్ర ప్రభుత్వం చెందిన కమర్షియల్ టాక్స్ శాఖకు చెందిన స్థలంలో కబ్జా చేసుకుని గత 20 ఏళ్లుగా స్థానికులు షెడ్లలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

సోమవారం ఉదయం మున్సిపల్ అధికారులు, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు. పాత బస్టాండ్ వద్ద అర్ధరాత్రి ప్రైవేటు ఫంక్షన్ నిర్వహించుకుంటున్న వ్యక్తులు కొందరు భారీ ఎత్తున టపాకాయలు పేల్చారు. టపాకాయలు కాల్చడంతో అగ్నిప్రమాదం జరిగిందని కొందరు అనుమాన పడుతున్నారు.