10 April, 2026 | 3:44 AM

నగరంలో భారీగా గంజాయి పట్టివేత

02-12-2024 02:02 AM

హైదరాబాద్ సిటీబ్యూరో/శేరిలింగంపల్లి డిసెంబర్ 1 : దూల్‌పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతీ టెంపుల్ సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు.రాజేందర్‌సింగ్, ఎం.వెంకటేశ్ వద్ద 2.11కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు.

మరో కేసులో నాగపూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మహ్మద్ ఖాన్ నుంచి 1.3కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. మరో ఘటనలో బేగంపేట సింధుకాలనీలో ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లు, 0.6గ్రాముల ఓజీకుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

20 కేజీల గంజాయి పట్టివేత

రంగారెడ్డి జిల్లా పరిధిలో గంజాయి తరలిస్తున్నట్లు అందిన పక్కా సమచారం మేరకు పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.  ఈ క్రమం లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నానక్‌రాం గూడ వద్ద శనివారం వాహన తనిఖీలు చేస్తుండగా.. ఓ కారులో గంజాయి తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకునేం దుకు ప్రయత్నించగా అతడు కారు వదిలి  పరారయ్యాడు.

కారు ఇంజిన్‌లో రహస్యంగా 13 ప్యాకెట్లలో ఉంచిన 20.19 కిలోల గంజాయి పొడిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో దొరికిన ఆధారాల ప్రకారం నిందితుడు చత్తీస్‌గఢ్ రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన బిక్రమ్‌హీరా (24)గా గుర్తించారు. 

చందానగర్‌లో : హర్యానా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్న ముఠా ను బాలానగర్ ఎస్‌ఓటీ, చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం మాదాపూర్ డీసీపీ జీ వినీత్ మీడి యా సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం హర్యానాకు చెందిన చమన్, బోయిన్ పల్లికి చెందిన శివంపేట ఉమాకాంత్, రాకేశ్, అర్జున సాయికృష్ణ హర్యానా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తెచ్చి అమ్మేందుకు ప్లాన్ వేశారు.

పక్కా సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసులు, చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చందానగర్ ఎస్‌ఐ ఆంజనేయులు, తన సిబ్బందితో కలిసి గంగారం హనుమాన్ టెంపుల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా ఉన్న టీఎస్ 22 హెచ్5068 కారును క్షుణ్నంగా తనిఖీ చేశారు. కారు డోర్‌లో రహస్యంగా తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన 57 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.