భారీ తిరంగా ర్యాలీలు
విజయక్రాంతి నెట్‌వర్క్, ఆగస్టు 13: భారత దేశ 80 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ జాతీయ జెండాలతో ర్యాలీలు కొనసాగాయి. హైదరాబాద్ తార్నాకలో, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాలలో వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఐడీపీఎల్ చౌరస్తాలో నిర్వహించిన ర్యాలీలో ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
వనపర్తిలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను నిర్వహించారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీలో విద్యార్థులు సుమారు 80 మీటర్ల భారీ జాతీయ జెండాను చేతబట్టి ప్రధాన వీధుల గుండా సాగారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ యువత దేశ సమగ్రత, ఐక్యతను కాపాడే తరంగా ఎదగాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనూ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.






