సర్పంచ్ పదవికి మస్తు క్రేజ్
- పదవిపై యువత ఉత్సాహం జూలైలో పంచాయతీ ఎన్నికలు..?
- 10 రోజుల గ్యాప్‌లోనే స్థానిక ఎన్నికలు
నల్లగొండ టౌన్, జూన్ 3: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే పోటీల్లో ఉండాలని అటు యువత.. ఇటు రాజకీయ పార్టీల లీడర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంతో పోలిస్తే ఎన్నడూ లేని విధంగా ఈసారి యువత రాజకీయాల్లోకి వచ్చేందుకు తెగ ఆరాటపడిపోతున్నారు. ప్రధానంగా సర్పంచ్ పదవిపై పోటీ చేసేందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు రూలింగ్ లో ఇది ప్రతిపక్షంలో ఎక్కువగా కనిపిస్తున్నది. యువ లీడర్లే గ్రామాలలో ఇప్పటికే రాజకీయ నాయకులు లోలోపల ప్రచారాలు చేపట్టారు అనే ఊహగనాలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు గ్రామాలలోని రచ్చబండ అదేవిధంగా చౌరస్తాలలోని ప్రధాన కూడలిలో ఉన్న పెద్ద మనుషులతో ఎం పెద్దయ్య, ఏం పెద్దమ్మ బాగున్నారా ఈసారి సర్పంచ్ కి నిలబడదామని అనుకుంటున్నాను, ఒకసారి కలిసి వెళ్లిపోదామని వచ్చాను, అని మాట ముచ్చట కలుపుతున్నారు.
రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్‌ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎక్కువ సన్నాహాలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమే గెలుస్తాం అనే ధీమాతో ఉన్నారు. కాదు కాదు ఆరు గ్యారెంటీ ల వల్ల ప్రజలు పూర్తిగా మోసపోయారని ఈసారి బీఆర్‌ఎస్ పార్టీకె పట్టం కడతారని రాబోయేది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అని బీఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు.
గ్రామాల్లో సుదీర్ఘ మంతనాలు..
ఏది ఏమైనా గ్రామాల్లోని కుల సంఘాల నాయకులతో గతంలో రాజకీయ అనుభవాలున్న పెద్ద మనుషులతో మంతనాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు అదేవిధంగా ఈసారి కచ్చితంగా బరిలో ఉంటాను అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. కొందరు నాయకులు గ్రామాలలోని స్థానిక వాట్సప్ గ్రూపులలో ఈసారి మా ఫలానా వ్యక్తి సర్పంచికి గెలుపు పక్క లే లేదు మా ఫలానా వ్యక్తి పక్క అనే విధంగా వాట్సాప్ గ్రూప్ చర్చ వేదికగా మారింది.
ఏది ఏమైనా అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్ల కన్నా స్థానిక సంస్థల ఎలక్షన్లు కోసం ప్రజలు ఎదురుచూపులు అంతా ఇంతా కాదు. ఇది ఇలా ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలలో పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు కనిపిస్తున్నా కూడా ప్రజల్ని సరిగా పట్టించుకోవడం లేదని ఊహాగానాలు ఉన్నాయి.
ఎక్కడ సభలు పెడతారు ఎక్కడ సమావేశాలు చెబుతారు వారికి తెలియదని కొందరు బీజేపీ శ్రేణులు అంటున్నారు. మీరు ఇలా ఉంటే మిగతా కొన్ని పార్టీలు వారు వారి సిద్ధాంతాల కోసం బాగానే పనిచేస్తున్నాయని కొందరు అభిప్రాయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు వేచి చూడాల్సి ఉంది.
బీసీల రిజర్వేషన్ పై మల్లగుల్లాలు...
కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రకటించింది. ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వే నిర్వహించింది. గణాంకాలను అసెంబ్లీలో ప్రకటించింది. 3.1 శాతం (16 లక్షల) జనాభా సర్వేలో పాల్గొనలేదని వెల్లడించింది. సర్వే గణాంకాలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్తోపాటు బీజేపీ, ప్రజాసంఘాలు, కుల సంఘాలు, మేధావులు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు.
రీ సర్వేకు డిమాండ్ చేశారు. దీంతో సర్కారు ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మళ్లీ కులగణన వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. 15 వేల లోపు కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించగలిగింది. ఈ గణాంకాలపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అప్పుడే 42 శాతం రిజర్వేషన్లపై బిల్లు పెడతామని, పార్లమెంట్లో ఆమోదం కోసం పంపిస్తామని చేతులు దులుపుకున్నది.
రాజకీయాల వైపు యువత చూపు..
ఇప్పటి వరకు రాజకీయాలంటే ఆసక్తి చూపని యువత ధోరణిలో మార్పు కనిపిస్తుంది. రోజూ ఊరిలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కారంపై దృష్టి సారించారు. ప్రజల్లో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో నిల్చుంటే ప్రజల మన్ననలు పొందేలా పనితీరును మార్చుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 844 గ్రామపంచాయతీలకు,352 ఎంపీటీసీ స్థానాలకు యువత పోటీపడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఎమ్మెల్యే, ఎంపీ పదవులను అధిష్ఠించిన వారిలో చాలా మంది సర్పంచ్ పదవి నుంచే తమ రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టడంతో స్థానిక ఎన్నికలను చాలా మంది ఓ అవకాశంగా తీసుకుంటారు. గ్రామంలో, మండలంలో పట్టు పెంచుకుంటే ఏ రాజకీయ పార్టీలో అయినా నేతగా ఎదిగే ఆస్కారం ఉండడంతో మొదట స్థానిక పదవుల్లో నెగ్గేందుకు చాలా మంది ప్రయత్నం చేస్తా రు.
ముఖ్యంగా సర్పంచ్ పదవిపై దృష్టి పెడతారు. రాజకీయ పార్టీ మద్దతుతో గెలవాలని చూస్తారు. ఒక వేళ ఒకేపార్టీలో ఎక్కువ మంది అభ్యర్థులు నిల్చుంటే తమ సొంత ప్రాబల్యంతో పాటు తమకు అనుకూలంగా ఉండే వారి మద్దతు తీసుకొని ఎన్నికల్లో గెల్చి ప్రజల్లో ఉన్న ఆదరణను నిరూపించుకుంటారు.
ఒక రకంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు చాలా మంది రాజకీయ ప్రస్థానానికి తొలి మెట్టుగా భావించొచ్చు. రానున్న జీపీ, పరిషత్ల ఎన్నికలను తమ రాజకీయానికి నాందిగా చేసుకోవాలని యువత భావిస్తోంది. రాజకీయ పదవులతో ప్రజాసేవ చేయడంతో పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంది.






