ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కుల విషయం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తన వ్యక్తిగత అంశం కాదని, రాజకీయ అంశం అసలే కాదని, ఇది తెలంగాణ ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కులకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా హైదరాబాద్ నగరం కమీషనర్ ఆఫ్ పోలీస్, ఐసీసీసీ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారుల ఎదుట వారు హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తన మొబైల్ ఫోన్ అనుమానాస్పదంగా ట్యాపింగ్‌కు గురైందని, దీనిపై తొలిసారిగా తాను డిఐజీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం చాలామంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాముఖ్యతతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం సంభాషణలను వినడమే కాకుండా, ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత స్వేచ్ఛలో అక్రమ జోక్యం చేసుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి గోప్యత హక్కు కల్పించబడిందని, సుప్రీంకోర్టు పుట్టస్వామి తీర్పు ద్వారా గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఉందని, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే భయం ఉంటే ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడలేరని అన్నారు. “భయం ఉన్న చోట స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛ లేని చోట ప్రజాస్వామ్యం ఉండదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడం ప్రజాస్వామ్యంపై దాడితో సమానం : ఎమ్మెల్యే యెన్నం
రాజకీయ పోటీ ప్రజల మధ్య ఎన్నికల్లో జరగాలని, గూఢచర్య మార్గాల్లో కాదని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిఘా ద్వారా రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలపై పూర్తి స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే సంబంధించినది కాదని, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు, విద్యార్థులు సహా ప్రతి మొబైల్ వినియోగదారుడి హక్కులకు సంబంధించిన అంశమని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమం స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం జరిగిందని, నిఘా రాజ్యం కోసం కాదని స్పష్టం చేశారు. ఈ కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి రావాలని, ఎవరు ఆదేశించారు, ఎవరు అమలు చేశారు, ఎంతమంది ప్రభావితులయ్యారు అనే అంశాలపై ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ విచారణ ప్రతీకారం కోసం కాదని, రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతోందని తెలిపారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా, వారు ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందేనని, ప్రజాస్వామ్యంలో ఎవరూ చట్టానికి అతీతులు కారని శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.






