3 April, 2026 | 1:51 AM

పవనపుత్రుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలి

03-04-2026 12:07 AM

 మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

మెదక్, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి) : మెదక్ పట్టణంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. హనుమాన్ భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి భావాన్ని చాటారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు స్వయంగా ఎమ్మెల్యే వడ్డించారు రామభక్త హనుమా, జై హనుమాన్ జై జై హనుమాన్ అనే నినాదాలతో మెదక్ పట్టణ పురవీధులు హనుమాన్ భక్తుల భక్తి పారవశ్యంతో మారుమోగాయి.

ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ శ్రీ హనుమంతుడు భక్తి, శక్తి, ధైర్యానికి ప్రతీక. హనుమాన్ జయంతి అంటే మనసుకు, శరీరానికి శక్తి, ధైర్యం, నిబద్ధతను ఇచ్చే పర్వదినం అని అభివర్ణించారు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గుణానికి ఆంజనేయుడే నిదర్శనం అని అన్నారు.

హనుమాన్ జయంతిని అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, పవనపుత్రుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ నరేష్, ప్రజా ప్రతినిధులు, హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.