calender_icon.png 10 May, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైం లైన్లు నిర్దేశించుకుని ‘సుంకిశాల’ రిటైనింగ్ వాల్ పునర్నిర్మాణం పనులు పూర్తి చేయాలి

23-04-2025 11:54:51 PM

జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి..

ప్రాజెక్టు పనులు పరిశీలించిన ఎండీ, అధికారులు..

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ పునర్నిర్మాణం పనులను టైం లైన్లు నిర్ధేశించుకుని పూర్తి చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. నాగార్జునా సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టు పనులను జలమండలి ఉన్నతాధికారులతో కలిసి ఆయన బుధవారం సందర్శించారు. సుంకిశాల టన్నెల్ గేట్ రిటైనింగ్ వాల్ ఓ పక్కకు ఒరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పైప్ లైన్ విస్తరణ పనులు.. సుంకిశాల ఇంటేక్ వెల్ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పైపు విస్తరణ పనులలో ప్రత్యేక దృష్టి సారించాలని ఏజెన్సీ అధికారులకు సూచించారు. నాణ్యతలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు.

ప్రస్తుతం సివిల్, టన్నెల్, ఎలక్ట్రికల్, పైపు లైన్ పనులు కొనసాగుతున్నాయని ఎండీ తెలిపారు. వీటిలో టన్నెల్, ఎలక్ట్రికల్ పనులు తుది దశకు చేరుకున్నాయని.. సివిల్ వర్క్స్ ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రిటైనింగ్ వాల్ శిధిలాల తొలగింపు పనులు వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్ట్ రిటర్నింగ్ వాల్ పునర్నిర్మాణానికి సంబంధించిన డిజైన్ లు వెంటనే సమర్పించాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు. అనంతరం పంప్ రూమ్ వైపు ఉన్న మిడిల్ టన్నెల్ పనులు పరిశీలించారు. వర్షాలు రాకముందే బండ్ నిర్మాణం, టన్నెల్ ప్లగ్గింగ్ పనులు పూర్తి చేయాలని, అందుకు రెండు షిఫ్టుల్లో పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్,  సీజీఎం మహేష్, జిఎంలు, ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు.. 

సాధారణంగా నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో డెడ్ స్టోరేజీలో 131 టీఎంసీలు, 510 అడుగుల నీరు ఉన్నంత వరకు వాడుకునే వెసులుబాటు ఉంటుంది. వేసవిలోనూ తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం సుంకిశాల ఇంటేక్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. నాగార్జున సాగర్ లో జలాలు డెడ్ స్టోరేజికి పడిపోయినా.. ఈ ప్రాజెక్టు ద్వారా నగరానికి తాగునీరు అందించవచ్చు.