28 April, 2026 | 3:04 AM

పరిశుభ్రమైన నగరంగా ఖమ్మం ఆదర్శంగా నిలిచేలా చర్యలు

28-04-2026 01:21 AM

మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

విస్తృతమైన రోడ్లు, 24 గంటల విద్యుత్, సరిపడా త్రాగునీరు 

రోడ్లు, డ్రైనేజీ, కాలనీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

నగరంలోని 16వ డివిజన్ లో కలెక్టర్ తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఖమ్మం, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): సౌకర్యవంతమైన రోడ్లులు, ప్రజలకు మెరుగైన జీవన వసతులతో పరిశుభ్రమైన నగరంగా ఖమ్మం ఆదర్శంగా నిలిచే విధంగా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సోమవారం ఖమ్మం నగర కార్పొరేషన్ 16వ డివిజన్ ద్వసంలాపురం లో రూ.1.20కోట్ల అంచనా వ్యయంతో  నూతనంగా చేపట్టిన సిసిరోడ్లు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు  జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ పి.శ్రీజ తో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా *మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని విస్తృత రహదారులు, సరిపడా తాగునీటి సరఫరా, 24 గంటల నిరంతర విద్యుత్ తో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పరిశుభ్రమైన నగరంగా ఖమ్మంను తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో ఇతర మున్సిపాలిటీలు ఖమ్మాన్ని ఆదర్శంగా తీసుకునేలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని, పేదలు, మధ్యతరగతి, ధనికులు అనే తేడా లేకుండా అందరికీ అవసరమైన సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖమ్మంకు పలు నేషనల్ హైవేలు అదుబాటులోకి వచ్చాయని,  రింగ్ రోడ్ ఏర్పాటు కానుందని, నగరానికి ట్రాఫిక్ సమస్యలు త్వరలో పరిష్కార మవుతాయని పేర్కొన్నారు. నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన మౌళిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 

నేషనల్ హైవే పనులను పరిశీలించిన మంత్రి

ద్వసంలాపురం వద్ద ఖమ్మం దేవరపల్లి నేషనల్ హైవే పై మున్నేరు రైల్వే బ్రిడ్జ్ వద్ద వంతన, ఖమ్మం కు ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాయింట్ పనులను కలెక్టర్ దివాకర్ టి.ఎస్ తో కలిసి మంత్రి తుమ్మల పరిశీలించారు. పనులు వేగ వంతంగా చేపట్టి రహదారులకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డివిజన్ కార్పోరేటర్లు మేడారపు వెంకటేశ్వర్లు, కమర్తపు మురళి, సంబంధిత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.