అడ్మిషన్ల మాయాజాలం
నోటిఫికేషన్ వెలువడక ముందే ఫీజుల దోపిడీ
కాలేజీకి వచ్చే వరకు ఒక ఫీజు వచ్చాక మరోఫీజు
రకరకాల పేర్లతో అందినకాడికి ఫీజులు వసూలు
డిమాండ్ పేరుతో ముందే అడ్మిషన్లను బ్లాక్ చేస్తున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలు
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ జూని యర్ కాలేజీలు అడ్మిషన్ల పేరుతో చేసే మాయాజాలం అంతాఇంతా కాదు. పదో తరగతి ఫరీక్షా ఫలితాలే వెలువడలేదు. అప్పుడే దాదాపు చాలా కాలేజీల్లో అడ్మిషన్లు చివరి దశకు వచ్చేశాయి. ఇప్పుడు అడ్వాన్స్ ఫీజు కడితే సీటు రిజర్వ్.. ఆ తర్వాత వస్తే సీటు కష్టమనే భావనను తల్లిదండ్రుల్లో సృష్టిస్తున్నారు. ఇక అడ్మిషన్ కోసం కాలేజీకి వచ్చే వరకు ఒక ఫీజు.. వచ్చాక మరో ఫీజు వసూలు చేస్తున్నారు.
అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రలకు కాలేజీల ఏజెంట్లు సంప్రదించినప్పుడు ఒక రకంగా ఫీజులు చెప్తూ సీటు ఖరారు చేసుకుని తీరా కాలేజీలకు వచ్చాక ఆ పేరు, ఈ పేరు చెప్పి దాదాపు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు అదనంగా ఫీజులను గుంజుతున్నట్లు ఆరోపణలున్నాయి. వాళ్లు చెప్పినంత ఫీజు కట్టలేదంటే సీట్లు లేవని, అయిపోయాయని తొందర పెడుతున్నారనే విమర్శులున్నాయి.
ఫస్ట్ ఇయర్ ఫీజు సెకండ్ ఇయర్‌కు ఉండదని, ఒకవేళ ముందే మాట్లాడినా ఎంతో కొంత పెంచేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో వసతులు లేకున్నా, పెద్దగా అనుభవం లేని అధ్యాపకులున్నా ఫీజులు మా త్రం ఆకాశన్నంటు తున్నాయి. హాస్టల్ గదు లు ఇరుకిరుకుగా ఉంటాయి. ఒకవేళ విశాలంగా ఉన్నా సామార్థ్యానికి మించి ఎక్కువ మంది విద్యార్థులను అందులో ఉంచుతున్నారు. మహిళా హాస్టళ్ల పరిస్థితి అయితే మ రీ దారుణంగా ఉంటున్నాయి. సరిగా భోజనమూ ఉండదు.
అడ్మిషన్ల సమయంలో మంచిగానే ఉంటుంది. ఆ తర్వాత మారిపోతుంది. గదులకు సరిగా వెంటిలేషన్ ఉండ దు. ఇరుకు గదుల్లో ఉంచుతారు. వాష్‌రూమ్స్ కూడా సరిగా ఉండని పరిస్థితి. తరగ తులు ప్రారంభమైన రెండుమూడు నెలల వరకు సీనియర్ అధ్యాపకులుండరు. జూనియర్ లెక్చరర్లతోనే కొన్ని క్లాసులు చెప్పిస్తు న్నారనే ఆరోపణలున్నాయి. నిలకడగా అధ్యాపకులు చివరి వరకు ఉండరు. సంవత్సరం పొడవునా అధ్యాపకులు మారుతూనే ఉంటారు. ఒక అధ్యాపకుడు సంవత్సరం పొడవునా ఉన్నారంటే గ్రేటే.
తమ వద్ద మం చి ఫ్యాకల్టీ ఉన్నారని చెబుతారు. పైగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరి ఆ కాలేజీకు వెళ్తే ఫీజులు మరోలా ఉంటాయి. సీట్లను బ్లాక్ చేస్తారు. ఈ పరిస్థితి ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్‌లోని కార్పొరేట్ కాలేజీల్లోనే ఉం టుంది. కాలేజీలు సీట్లు అయిపోతున్నాయం టూ కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి మాయమాటలు చెప్పి సొమ్ము చేసుకుంటున్నాయి. పైగా అడ్వాన్స్‌డ్ బుకింగ్ పేరుతో సీట్లను బుకింగ్ చేసుకోవాలంటూ సీట్లను బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలూన్నాయి. హాస్టళ్లు తమ పరిధిలోకి రావని ఇంటర్ బోర్డు చేతులు దులుపుకుంటోందని విద్యార్థి సం ఘాల నేతలు విమర్శిస్తున్నారు
ఇప్పుడెల్తే ఒకలా... అప్పుడెల్తే మరోలా ఫీజులు..
ఒక్కో నెలలో కాలేజీల ఫీజులు ఒక్కోలా వసూలు చేస్తున్నారు. డిసెంబర్, జనవరి నెలలోఒకలా ఫీజులుంటే, పదో తరగతి పరీక్ష ఫలితాలకు ముందు, పదో తరగతి పరీక్ష ఫలితాల తర్వాత మరోలా ఫీజులుంటాయి. ఇక జూన్‌లో వెళ్తే సీట్లు దొరకడమే కష్టమనేస్తారు. ‘ఇంత లేట్‌గా వచ్చారేంది.. సీట్లు అయిపోయాయి. ఇప్పుడు సీటు దొరకడం కష్టం’ అని నమ్మబలుకుతారు. ‘ఫీజు కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు.. తాము కట్టే స్తాం’ అని చెబితే చాలూ సీటు దొరికేస్తుంది.
పైగా జేఈఈ, నీట్, ఎప్‌సెట్ పేర్లతో బురిడీ కొట్టిస్తారు. రెగ్యులర్ ఇంటర్ చదివిద్దామనో.. లేక ఎప్‌సెట్ సెక్షన్ కోసమని వెళ్లే పేరెంట్‌కు లేనిపోని ఏవో మాయమాటలు చెప్పి జనరల్ సెక్షన్ వేస్ట్...జేఈఈ, నీట్ సెక్ష న్లు మంచిదనే భావనను వాళ్లపై రుద్దడంతో ఇక చేసేదిలేక విద్యార్థుల తల్లిదండ్రులు వారు అడిగినంత ఫీజు ఇచ్చి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. మంచి కాలేజీల్లో సీటు దొరక దేమోనన్న ఆందోళనతో కాలేజీల వెంట పరుగులు పెడుతున్నారు. ఏడాదికి ఏసీ, నాన్ ఏసీ క్యాంపస్‌ల పేరుతో రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
టెన్త్ ఫలితాలే రాలేదు.. కానీ జోరుగా అడ్మిషన్ల దందా..
వాస్తవానికి టెన్త్ ఫలితాలు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్‌లో అడ్మిషన్ నోటిఫికేషన్‌ను ఇంటర్ బోర్డు జారీచేస్తోంది. కానీ పదో తరగతి పరీక్షలు పూర్తికాకముందు నుంచే ఈ దందా నడుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధం. పైగా కాలేజీకు అలవాటు పడాలని ఫలితాలు వచ్చిన వెంటనే తరగతులు ప్రారంభిస్తామని నమ్మిస్తున్నారు. జూన్ 1 నుంచి కొత్త విద్యాసంవత్సరానికి తరగతులు ప్రారంభం కావాలి.
కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు రాకముందే ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు మొదలుపెట్టేశారు. ఈ దందాను ఇంటర్ బోర్డు అధికారులు అరికట్టాలని విద్యార్థి సంఘాల నేతలు, తల్లిదండ్రులు కోరుతున్నారు. కాలేజీలను నియంత్రించడంలో, ఈ దందాను అడ్డుకోవడంలో అధికారుల అలసత్వం, పర్యవేక్షణలోపం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.






