23-11-2025 06:05:24 PM
మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
పాపన్నపేట (విజయక్రాంతి): మహిళల అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, మహిళల ఆర్థికాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని వెలుగు మండల సమైక్య ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై చీరలు పంపిణీ చేశారు. అనంతరం గాంధారిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు అశోక్ కూతురి కేశఖండనం కార్యక్రమంలో పాల్గొన్నారు. చీరలు పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా ఎంపికైన మహిళా గ్రూపు సభ్యులకు ఆ గ్రూపుల ద్వారా రూ.2 లక్షల మేరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
మహిళల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం, గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సొంత ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలువాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి, వారి ఉన్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రాబోవు రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు సమర్థవంతంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సేవతో ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నరేందర్ గౌడ్, శ్రీనివాస్, శ్రీకాంతప్ప, గౌస్ పాషా, చోటు తదితరులు పాల్గొన్నారు.