23-11-2025 05:44:26 PM
మహారాష్ట్ర: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ స్మృతి మంధాన(Smriti Mandhana), మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్(Palash Muchhal)తో ఈరోజు జరగాల్సిన వివాహం నిరవధికంగా వాయిదా పడింది. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన అనారోగ్యం కారణంగా వివాహం వాయిదా పడింది. ఈరోజు అల్పాహారం సమయంలో ఆయన ఆరోగ్యం బాగాలేదు. కొంత సమయం తర్వాత అంతా సాధారణమవుతుందని భావించారు. కానీ పరిస్థితి మరింత దిగజారింది. ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉన్నారని, పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు పేర్కొన్నారు. స్మృతి మంధాన తన తండ్రికి చాలా దగ్గరగా ఉంటారు. ఆయన ఆరోగ్య సమస్యల దృష్ట్యా వివాహ వేడుకను తన తండ్రి కోలుకునే వరకు నిరవధికంగా వాయిదా వేయాలని క్రికెటర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా.. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ఈరోజు మహారాష్ట్రలోని సాంగ్లిలో దగ్గరి కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో వివాహం చేసుకోవాలని భావించారు. వివాహ వేడుకల సమయంలో మహిళల ప్రపంచ కప్ విజేత భారత క్రికెట్ జట్టులోని చాలా మంది సభ్యులు స్మృతితో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఈ జంట బాలీవుడ్ తరహాలో వివాహానికి ముందు వేడుకలకు సంబంధించిన వీడియోలు, చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఈ జంట ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.