23-11-2025 06:00:05 PM
ఐటిడిఏ అధికారి రాంబాబు
భద్రాచలం (విజయక్రాంతి): ప్రేమ, అహింస, సత్యం, ధర్మం, శాంతి ఇవే ప్రతి మనిషి జీవన ప్రయాణానికి అసలు దీపాలు అని బోధించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నినాదమని ఐటీడీఏ పరిపాలన అధికారి రాంబాబు అన్నారు. ఆదివారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి, రాహుల్, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అధికారిక పనులపై వెళ్లి అందుబాటులో లేనందున ఐటీడీఏ సిబ్బంది సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 1926 సంవత్సరం నవంబర్ 23 తేదీన ఈశ్వరమ్మ వెంకమరాజు దంపతులకు జన్మించాడని, 1940వ సంవత్సరంలో అనగా 14 ఏళ్ల వయసులో సత్య సాయి బాబా అవతారం ఎత్తాడని, మానవసేవే మాధవసేవ సత్య సాయి బాబా ప్రస్థానమని, మానవసేవే మాధవసేవలని చాటిన అవతార మూర్తి సత్యసాయిబాబా అని అన్నారు.
1948 వ సంవత్సరంలో భక్తులచే ప్రశాంత నిలయం ప్రారంభించాడని, తెలుగు నేలపై పుట్టిన కారణజన్ముడు సత్యసాయి బాబా అని విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, తాగునీరు వంటి ప్రజావసరాల కోసం వారు ప్రారంభించిన సేవా కార్యక్రమాలు నేటికీ కోట్ల కుటుంబాలకు ఆశాకిరణాలుగా నిలుస్తున్నాయని, ఆయన స్థాపించిన వైద్యలయాలు, విద్యాలయాలు ఆయనకు విశేష కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాయని, 166 దేశాల్లో పదివేలకు పైగా సత్యసాయి సేవా సంస్థలు సేవలందిస్తున్నాయని అన్నారు.
“సేవాభావమే నిజమైన దైవత్వం” అని భగవాన్ సత్యసాయి బాబా తన జీవనం ద్వారా నిరూపించారని,భగవాన్ చూపిన ప్రేమ-సేవ మార్గంలో పయనిస్తూ సమాజం కోసం అంకితమై పనిచేస్తున్న కోట్లాది భక్తులు, సేవాదళాలు, యువకులు అందరూ సత్యసాయి తత్వానికి సజీవ ప్రతిరూపాలని, వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా గిరిజనులకు సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఆదినారాయణ సిబ్బంది లక్ష్మయ్య, శ్రీనివాస్, రామ్ కుమార్, సాయి చందు, పవన్, జానీ, వీరయ్య, తులసి, సుజాత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.