24-12-2025 11:22:54 AM
మేడారం పనుల్లో కీలక ఘట్టం
హైదరాబాద్: ములుగు జిల్లాలోని మేడారం(Medaram Development works) పునర్నిర్మాణ పనుల్లో కీలక ఘట్టం మొదలైంది. మేడారంలో గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గోవిందరాజును బుధవారం ఉదయం 6 గంటలకు పగిడిద్దరాజును 9.45 గం, పూజారులు ప్రతిష్ఠించారు. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, జాతర కార్యనిర్వహణాధికారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. పూజారులు రహస్యంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరకు పూజా కార్యక్రమాల క్రతువు కొనసాగనుంది. ఇవాళ మేడారంలో భక్తులకు వన దేవతల దర్శనాలు నిలిపివేశారు.
సమ్మక్క–సారలమ్మ ఆలయ(Sammakka-Saralamma temple) అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి ములుగులోని మేడారం చేరుకున్నారు. వీరికి పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ సూపరింటెండెంట్ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా, భూపాలపల్లి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిరిశెట్టి సంకీర్త్, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్ పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలకు మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, మహా జాతరను దృష్టిలో ఉంచుకుని, వారు మేడారంలోని చిలుకలగుట్ట రోడ్డు, స్థూపం, కన్నెపల్లి, జంపన్నవాగు, ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంతాలలో జరుగుతున్న ఆలయ, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను తనిఖీ చేశారు.