calender_icon.png 24 December, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేటర్ చరిత్రలో సువర్ణాధ్యాయం!

24-12-2025 02:01:28 AM

రూ. 13 వేల కోట్లతో మెగా బడ్జెట్

  1.   29న కౌన్సిల్ ప్రత్యేక సమావేశం
  2. ముసాయిదా ఆమోదానికి రంగం సిద్ధం
  3. పాత జీహెఎంసీ పరిధికి రూ. 11,050 కోట్లు.. 
  4. కొత్తగా విలీనమైన 27 సర్కిళ్లకు రూ. 1,950 కోట్లు

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 23 (విజయక్రాంతి):  విశ్వనగరంగా విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  సరికొత్త రికార్డుకు సిద్ధమైంది. కార్పొరేషన్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 2026- ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు రూ. 13,000 కోట్లతో మెగా బడ్జెట్ ను అధికారులు రూపొందిస్తున్నారు. ఇటీవలే 27 శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెఎంసీలో విలీనం కావడం, నగరం భౌగో ళికంగా భారీగా విస్తరించడంతో.. ఆ స్థాయిలోనే నిధులు అవసరమని గుర్తించిన యంత్రాంగం ఈ జంబో బడ్జెట్‌కు రూపకల్పన చేసింది.

ఈ ముసాయిదా బడ్జెట్‌పై చర్చించి, ఆమోదముద్ర వేసేందుకు ఈ నెల 29న జీహెఎంసీ సర్వసభ్య సమావేశం  ప్రత్యేకంగా భేటీ కానుంది. ఇటీవల డీలిమిటేషన్‌పై భేటీ అయిన కౌన్సిల్, ఇప్పుడు బడ్జెట్‌పై దృష్టి సారించింది. రానున్న ఆర్థిక సంవత్సరం 2026-27 బడ్జెట్ ముసాయిదాపై కౌన్సిల్ సభ్యుల అభిప్రాయాలను, సూచనలను స్వీకరించేందుకు ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సభ్యులు ముందస్తుగా బడ్జెట్ ప్రతిపాదనలను అధ్యయనం చేసేందుకు వీలుగా.. ఈ నెల 26, 27 తేదీల్లోనే కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులందరికీ బడ్జెట్ కాపీలను సర్క్యులేట్ చేయాలని నిర్ణయించారు.

అంచనాలు అమాంతం ఎందుకు పెరిగాయి?

వర్తమాన ఆర్థిక సంవత్సరం 2025-26 బడ్జెట్ రూ. 8,440 కోట్లు కాగా, వచ్చే ఏడాదికి దీనిని ఏకంగా రూ. 13 వేల కోట్లకు పెం చుతున్నారు. అంటే దాదాపు రూ. 4,560 కోట్ల మేర పెంపు ఉండనుంది. ఇందుకు ప్రధాన కారణం విలీనం , డీలిమిటేషన్.

పాత జీహెఎంసీ వాటా

విలీనానికి ముందు పాత జీహెఎంసీ పరిధి 30 సర్కిళ్లు అభివృద్ధి, నిర్వహణకు రూ. 11,050 కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

కొత్త సర్కిళ్ల వాటా.. 

కొత్తగా విలీనమైన 27 సర్కిళ్లలో మౌలిక వసతుల కల్పన పెద్ద సవాలుగా మారింది. దీంతో ఆయా ప్రాంతాల నుంచి తెప్పించుకున్న ప్రతిపాదనల ఆధారంగా.. తొలి ఏడా దికి రూ. 1,950 కోట్లను అదనంగా బడ్జెట్లో చేర్చారు.ఈ రెండూ కలిపి మొత్తం బడ్జెట్ రూ. 13 వేల కోట్ల మార్కును దాటనుంది. డీలిమిటేషన్ ద్వారా వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెరుగుతుండటంతో, పరిపాలనా వ్యయం కూడా పెరిగే అవకాశముంది. వచ్చే ఏడాది రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే జీహెఎంసీ అధికారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం జీహెఎంసీకి అండగా నిలుస్తుండటమే ఇందుకు కారణం.

ప్రతిష్ఠాత్మక హెచ్-సిటీ ప్రాజెక్టులు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హె-సిటీ కింద 5 ప్యాకేజీలలో 23 భారీ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంది. వీటికి సుమారు రూ. 7,038 కోట్లు అవసరమవుతాయని అంచ నా. ఈ నిధులను ప్రభుత్వం స్టేట్ బడ్జెట్ ద్వారా కేటాయించే అవకాశం ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జీహెఎంసీ రూ. 3,000 కోట్ల ప్రతిపాదనలు పంపితే, బడ్జెట్లో కేవలం రూ. 400 నుంచి రూ. 500 కోట్లు మాత్రమే కేటాయించేవారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది రూ. 7,000 కోట్ల విలువైన పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

ఈ సానుకూల ధోరణితోనే అధికారులు స్టేట్ బడ్జెట్ నుంచి వచ్చే గ్రాంట్లపై భారీ అంచనాలు వేసుకున్నారు. ఈ నెల 29న జరిగే ప్రత్యేక సమావేశంలో అన్ని పార్టీల సభ్యుల అభిప్రాయాలు సేకరించిన అనంతరం, అవసరమైన మార్పులు చేర్పులతో ముసాయిదాను ఆమోదించి రాష్ర్ట ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఈ మెగా బడ్జెట్ అమల్లోకి రానుంది. విస్తరించిన నగరానికి ఈ బడ్జెట్ ఏ మేరకు న్యాయం చేస్తుందో వేచి చూడాలి.