10-12-2025 12:56:24 AM
జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి రవి నాయక్
నాగర్ కర్నూల్, డిసెంబర్9 (విజయ క్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రి స్కానింగ్, అల్ట్రా సౌండ్ సెంటర్లపై జిల్లా వైద్యాధికారులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నారన్న ఫిర్యాదులు అందడంతో జిల్లా ఇన్చార్జి వైద్యాధికారి రవి నాయక్ తన బృందంతో కలిసి ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు, నర్సింగ్ హోమ్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ కీలక రికార్డులను పరిశీలించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ముఖ్యంగా స్కానింగ్ సెంటర్లలో గర్భిణీ స్త్రీల వివరాలు, పరీక్షల రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పక్కన ఉన్న విహానా స్కానింగ్ సెంటర్, శ్రీదేవి సిటీ స్కానింగ్ సెంటర్, రుద్ర డెంటల్ క్లినిక్, బాలాజీ డయాగ్నోస్టిక్ సెంటర్, కృప ఫిజియోథెరపీ సెంటర్లలో వైద్య సేవలు, రోగుల రిజిస్టర్లు, స్కానింగ్ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆకస్మిక తనిఖీలతో అక్రమాలకు పాల్పడేవారిలో ఆందోళన మొదలైంది.
నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వ్యక్తుల చేత స్కానింగ్, ఎక్స్రే టెస్టులు వంటివి చేయిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ధరల పట్టిక ప్రదర్శించి వాటి ఆధారంగానే ఫీజులు వసూలు చేయాలన్నారు. ఈ తనిఖీల్లో జిల్లా ఉప మాస్ మీడియా అధికారి రాజగోపాల చారి, హెల్త్ ఎడ్యుకేటర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.