24 August, 2026 | 2:11 AM

జిల్లా కేంద్రాల్లోనే 90 శాతం వైద్య చికిత్సలు

24-08-2026 01:40 AM

ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి

నారాయణఖేడ్, ఆగస్టు 23 : జిల్లా కేంద్రాల్లోనే 90 శాతం వైద్య చికిత్సలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఆదివారం ఆయన నారాయణఖేడ్ పట్టణంలో ఆధునికంగా ఏర్పాటు చేసిన బాలాజీ అనురాధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను మంత్రి పరిశీలించారు.

నారాయణఖేడ్ ప్రాంత ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన ఆసుపత్రి నిర్వాహకులను మంత్రి అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు జిల్లా స్థాయిలోనే 90 శాతం వైద్య చికిత్సలకు సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రజా వైద్య, ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అందిస్తున్న సేవలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ హరిణి, ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ పట్లోళ్ల అనురాగ్ రెడ్డి, డాక్టర్ కే శ్రీధర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. 

వీరయ్య మాస్టారును పరామర్శించిన మంత్రి...

ఆందోల్ నియోజకవర్గంలోని చౌటకూరు మండల కేంద్రంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు వీరయ్యను మంత్రి పరామర్శించారు. వీరయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వీరయ్య కుమారుడు మర్రి ప్రదీప్ మునిపల్లి మండలంలో డిప్యూటీ తహసిల్దారుగా విధులు నిర్వహిస్తున్నారు. 

టిఫిన్ సెంటర్లో సందడి..

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గంలోని సంగుపేట చౌరస్తాలో సందడి చేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా సంగుపేట చౌరస్తాకు వచ్చిన మంత్రి దామోదర్ రాజనర్సింహ నూతనంగా ఏర్పాటు చేసిన టిఫిన్ సెంటర్ నిర్వాహకులు తమ హోటల్ లో అల్పాహారం తీసుకోవాలని చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. నిర్వాహకుల కోరిక మేరకు వేడిగా తయారు చేసిన దోశను అల్పాహారంగా తీసుకున్నారు. దీంతో హోటల్ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.