9 July, 2026 | 1:11 AM

ఫ్యూచర్ సిటీ రహదారి భూసేకరణకు మేడిపల్లి గ్రామస్తుల గ్రీన్ సిగ్నల్

09-07-2026 12:16 AM

ఇబ్రహీంపట్నం, జులై 8(విజయక్రాంతి) రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీ అనుసంధాన రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ముందడుగు పడింది. యాచారం మం డలం మేడిపల్లి గ్రామస్తులు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారానికి అంగీకరిస్తూ తమ సమ్మతి పత్రాలను (కాన్సెంట్ పిటిషన్స్ ) అధికారులకు అందజేశారు.బుధవారం కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఛాంబర్లో గ్రామస్తులతో ఒక సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ భూసేకరణ నిబంధనలు, రైతులకు లభించే ప్రయోజనాలు, పరిహారం చెల్లింపు వివరాలను గ్రామస్తులకు వివరించారు. సానుకూల వాతావరణంలో జరిగిన చర్చల అనంతరం, గ్రామస్తులు స్వచ్ఛందంగా భూసేకరణకు అంగీకారం తెలిపారు.భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన మేడిపల్లి గ్రామస్తులకు అదనపు కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.