9 July, 2026 | 1:22 AM

హయత్‌నగర్ డివిజన్‌లో కలుషిత నీరు

09-07-2026 12:17 AM

పరిశీలించిన మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

ఎల్బీనగర్, జులై 8: హయత్‌నగర్ పాత గ్రామంలోని కాస్ బాగ్ ప్రాంతంలో కలుషితమైన మంచినీటి సరఫరా కారణంగా గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి గారు జలమండలి అధికారులతో కలిసి బాధిత ప్రాంతాన్ని సందర్శించి సమస్యను పరిశీలించారు. స్థానిక ప్రజల నుంచి సమస్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, కలుషిత నీటి వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జలమండలి అధికారులతో మాట్లాడి, సమస్యకు గల కారణాలను గుర్తించి, పైప్లైన్ మరమ్మత్తు పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు నిరంతరాయంగా అందేలా అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని అధికారులను కోరారు. మరమ్మత్తు పనులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన తాగునీటి సరఫరా కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జలమండలి ఇన్ స్పెక్టర్ రమేశ్, ఆయా కాలనీల ప్రజలు పాల్గొన్నారు.