30-09-2025 12:45:27 AM
నూఢిల్లీ, సెప్టెంబర్ 29: భారత ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. వీరి మధ్య స్నేహం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో మోదీ, మెలోని కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏకంగా ‘#మెలోడి’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. ట్రెండ్‌పై మోదీ, మెలోనీ ఇద్దరూ సరదగా స్పందించారు కూడా. అలాంటి ‘మెలోడి’ మూమెంట్ మరోసారి వచ్చింది.
మెలోని 2021లో తన ఆత్మకథ ‘ఐయామ్ జార్జియా - మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్’ రాశారు. ఆ పుస్తకానికి హర్ మన్ కీ బాత్ (ఆమె మనసులోని మాట) పేరిట భారత ప్రధాని మోదీ ముందుమాట రాశారు. ఆమెగొప్ప దేశభక్తురాలని, అత్యుత్తమ నాయకురాలని మోదీ ఆ ముందు మాటలో ప్రశంసించారు. ఇప్పుడెందుకు మళ్లీ ఆ విషయం ట్రెండింగ్‌లోకి వచ్చిందంటే మెలోని ఆత్మకథ పుస్తకం వచ్చే నెల 7న భారత మార్కెట్‌లోకి రానున్నది.
ఈ పుస్తకంలో ఏముంది?
పుస్తకం 2021లో ఇటలీలో వచ్చింది. పాఠకుల నుంచి ఆదరణ లభించి బెస్ట్ సెల్లర్‌గానూ నిలిచింది. పుస్తకం విడుదలైన సమయంలో మెలోనీ ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో పుస్తకం అమె రికా వెర్షన్ విడుదలైంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్ ట్రంప్ జూనియర్ ఆ వెర్షన్‌కు ముందుమాట రాశారు. భారతీయ వెర్షన్‌కు ప్రధాని మోదీ ముందుబాట రాయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నది.