30-09-2025 12:49:07 AM
న్యూయార్క్, సెప్టెంబర్ 29 : బ్లాక్ హోల్స్, సూపర్‌నోవా, న్యూట్రాన్ స్టార్స్ రహస్యాలపై అధ్యయనం చేసేందుకు 2004లో ‘నాసా’ భూకక్ష్యలోకి పంపిన నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ టెలిస్కోప్ క్రమం గా తన శక్తి సామర్థ్యాలను కోల్పోతున్నది. భూమికి 585 కి.మీ ఎత్తులో పరిభ్రమించే ఈ టెలిస్కోప్ 1.4 టన్నుల బరువు ఉండి గామా కిరణాల విస్ఫోటనాలు, ఎక్స్, అతినీల లోహిత కిరణాలు, కాంతిపుంజాలు, వాస్తవిక సమయ డాటాను విశ్లేషించి ‘నాసా’కు సమాచారం పంపిస్తుంది.
వాతావరణ మార్పులు, ఇతర సాంకేతిక కారణాలతో టెలిస్కోప్ పరిభ్రమణ సామర్థ్యాన్ని కోల్పోతూ నెమ్మదిగా భూమివైపు పయనం సాగిస్తున్నది. అలా 2026 చివరి నాటికి భూ వాతావరణంలోకి ప్రవేశించి, 90శాతం దగ్ధమయ్యే అవకాశం ఉందని ‘నాసా’ అంచనా వేస్తున్నది. కానీ, అందుకు మనస్కరించక ‘నాసా’ టెలిస్కోప్ రక్షణకు పూనుకున్నది.
దీనిలో భాగంగానే టెలిస్కోప్ జీవితకాలం పెంచేందుకు అరిజోనాకు చెందిన ‘కెటలిస్ట్ స్పేస్ టెక్నాలజీస్’ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించింది. అందుకు 30 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నది. సదరు సంస్థ వచ్చే ఏడాది మే నాటికి రంగంలోకి దిగి అత్యాధునిక రోబోటిక్ అట్‌మెంట్ వ్యవస్థను ప్రయోగించి, టెలిగ్రాఫ్‌ను యథా స్థానానికి చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ లక్ష్యం నెరవేరితే.. జీవితకాలం పెరిగి సదరు స్విఫ్ట్ టెలిస్కోప్ మరికొన్నేళ్ల పాటు విశ్వ రహస్యాలను ఛేదించే పనిలోపడుతుందన్న మాట.