04-07-2025 12:02:33 AM
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డులను ఒకే గొడుగు కిందకు తేవాలని తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఆదేశించింది. ఇంటర్ బోర్డును ఎస్సెస్సీలో విలీనం చేయాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభు త్వం ముందుంచింది. రాష్ట్రంలో రెండు బోర్డులు అవసరమా అని ప్రశ్నించినట్లు తెలిసింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర విద్యాశాఖ సమావేశంలో తెలంగాణతోపాటు అన్ని రాష్ట్రాల నుంచి పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో పలు అంశాలపై ఆయా రాష్ట్రాలకు కేం ద్రం పలు సూచనలు చేసింది. పదో తరగతి ఉత్తీర్ణత తర్వాత విద్యార్థులు పై తర గతుల్లో చేరుతున్నారా అనే సమాచారం ఉండడం లేదని, మధ్యలోనే వారంతా డ్రాపౌట్ అవుతున్నారనే అనుమానాన్ని కేంద్రం వ్యక్తం చేసింది. తెలంగాణ, ఏపీ, యూపీ, బీహార్, తమిళనాడుతో పాటు మరో మూడు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ఒకే బోర్డు విధానం అమలవుతోందని కేంద్రం స్పష్టం చేసింది.
విలీనంతో దేశవ్యాప్తంగా ఒకే సిలబస్, ఒకే పరీక్షల విధానం అమలు చేయొచ్చని, దీంతో విద్యార్థులకూ ఉపయోగం ఉంటుందని తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో మాతృభాషలో పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అతి తక్కువమంది ఉత్తీర్ణులవుతున్నారని, ఆంగ్లమాధ్యమంలోనే ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధిస్తున్నారని పేర్కొంది. ఈ క్రమంలోనే ఎస్సెస్సీ బోర్డులో ఇంటర్ బోర్డును కలిపేలా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అధికారులకు కేంద్రం సూచించడంతో ఈ ప్రతిపాదనపై ఆలోచిస్తామని మన అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 5+2+3+2 విద్యావిధానం అమల్లో ఉంది. పదో తరగతి తర్వాత ఇంటర్ విద్యను కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కిందకు తేవాలని కేంద్రం సూచిస్తోంది. ఇప్పటికే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా 5+3+3+4 (5 వరకు ప్రీ ప్రైమరీ, 8 వరకు అప్పర్ ప్రైమరీ, 9 నుంచి సెకండరీ ఎడ్యుకేషన్) విధానం అమలు చేయాలని చూస్తోంది. ప్రస్తుతం మన రాష్ర్టంలో స్కూల్, ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌లు వేర్వేరుగా అమలవుతున్నాయి.
కొత్త విధానం అమలు చేస్తే ప్రత్యేకంగా ఇంటర్ విద్య అనేది లేకుండా పోతుంది. మరోపక్క కేజీబీవీ, మోడల్ స్కూల్ 600 పాఠశాలల్లో ఇంటర్ విద్య అందుబాటులో ఉంది. ఇంటర్ బోర్డు పరిధిలో ప్రభుత్వ కాలేజీలు 430 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్ విద్యను విలీనం చేయాలని కేంద్రం సూచించినట్లుగా తెలుస్తోంది.
దీనివల్ల పర్యవేక్షణ సులభం కావడంతోపాటు సర్కారుపై ఆర్థిక భారం తగ్గడం, కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంది ఎంతవరకు సాధ్యమవుతుందనేది చూడాల్సి ఉంది. ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
ఒకేషనల్ బోర్డు సైతం...
ఒకేషనల్ కోర్సులు గతంలో హైస్కూళ్లలో అందుబాటులుండేవి. ఇప్పుడు ఒకేషనల్ కోర్సులను ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తున్నాయి. వీటిని ఒకేషనల్ ఎడ్యుకేషన్ బోర్డు కిందకు తీసుకురావాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించినట్లు అధికారులు తెలిపారు. సర్టిఫికెట్లన్నీ ఈ బోర్డే ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నారు. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ వరకు సర్టిఫికెట్లు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.