04-12-2025 12:12:55 AM
జిల్లా సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం
నిర్మల్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): సూక్ష్మ పరిశీలకులు (మైక్రో అబ్జర్వర్లు) తమ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని గ్రామపంచాయతీ ఎన్నికల జిల్లా సాధా రణ పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం అన్నారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామపంచా యతీ ఎన్నిక విధుల్లో పాల్గొనబోయే సూక్ష్మ ప రిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనరల్ అబ్జర్వర్ అయేషా మస్రత్ ఖానం, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశీలకులు మాట్లాడుతూ, మైక్రో అబ్జర్వర్లుగా విధులు నిర్వహించబోయే అధికారులకు ముందుగానే సమాచారం అందించామన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ ఓటు విధానాన్ని వినియోగించుకొని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని అన్నారు.
శిక్షకులు అందించిన సమాచారాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, ఎన్నికల విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని వివరించారు అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు.అబ్జర్వర్లకు తమ ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. ఈ సమావేశం లో డిపిఓ శ్రీనివాస్, డీఈవో భోజన్న, ఎల్డీఎం రామ్ గోపాల్, శిక్షకులు, మైక్రో అబ్జర్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సామాగ్రి పంపిణీ సమర్థవంతంగా చేపట్టాలి: కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 3(విజ యక్రాంతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం నుండి కేటాయించిన ప్రకారంగా సామాగ్రి పంపిణీ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జైనూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో జైనూర్ మండలంలోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఈ నెల 11న జరగనున్న పోలింగ్ నిర్వహణ కొరకు ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆర్డిఓ లోకేశ్వర్ రావు తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జైనూర్ మండలంలో 26 సర్పంచ్ స్థానాలు, 222 వార్డు సభ్యుల స్థానాలకు తొలి విడతలో భాగంగా ఈ నెల 11వ తేదీన పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రిసైడింగ్, సహాయం ప్రిసైడింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది ఈ నెల 10వ తేదీన ఉదయం 9 గంటలకు పంపిణీ కేంద్రంలో రిపోర్టు చేస్తారని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
షామియానా, కుర్చీలు, టేబుల్లు సరిపడా ఏర్పాటు చేయాలని, పంపిణీ కేంద్రంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణ సిబ్బందికి త్రాగునీరు, అల్పాహారం, భోజన వసతి కల్పించాలని, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, తహసిల్దార్, సి.ఐ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఎస్. ఐ., సంబంధిత అధికారులు పాల్గొన్నారు.