మిల్లర్‌ల కొర్రీ.. రైతులకు తప్పని వర్రీ..
నాణ్యత లోపం పేరిట దిగుమతి నిలుపుతున్న మిల్లర్ లు
అవకాశం ఉన్నకాడికి తరుగు పేరిట దోపిడీ
మిల్లర్ల సిండికేట్ ధాన్యం ధరకు చేటు
వాతావరణ మార్పులతో రైతులు బెంబేలు
ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని వేడుకోలు
మిర్యాలగూడ, ఏప్రిల్ 26: మిర్యాలగూడ, వేములపల్లి, మాడుగులపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాలలో పలు ఐకెపి సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐకెపి సెంటర్లకు రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తరలించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి 2389 రూపాయలు బి గ్రేడ్ రకానికి 2369 రూపాయలను మద్దతు ధరగా ప్రకటించి కొనుగోలు చేస్తుంది.
దీంతో రైతులు ధాన్యాన్ని మ్యాచరు వచ్చే విధంగా ఆరబెట్టుకొని ఐకెపి సెంటర్లో ధాన్యాన్ని పోశారు. దీంతో ఐకెపి పిఎసిఎస్ సిబ్బంది కాంటాలు వేసి లారీల ద్వారా దిగుమతికి పలు మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో మిల్లు యాజమాన్లు వడ్లు సరిగా ఎగపోయలేదు తాలు ఉన్నది అని కొర్రీలు పెడుతూ దిగుమతిని ఆలస్యం చేస్తుండడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
దిగుమతికి మిల్లర్ల కొర్రీలు:
దిగుమతి చేసుకోకుండా రెండు, మూడు రోజులు ఆపడంతో ఐకెపి, పిఎసిఎస్ నిర్వహకులు మిల్లుల యజమానులను ఎందుకు దిగుమతి చేసుకోవట్లేదు అని అడగడంతో కొర్రీలు పెడుతూ తాలు, దుమ్ము, ధూళి ఉంది అని లోడుకు మూడు నుంచి ఐదు క్వింటాలు తరుగు తీస్తామని చెప్పడంతో ఐకెపి నిర్వాహకులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. దీంతోపాటు రైతులకు పరిస్థితిని వివరించడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
మిల్లర్ ల సిండికేట్ ధాన్యం ధరకు చేటు
మిల్లుల అసోసియేషన్ సిండికేట్ గా మారి యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యానికి రేటు మద్దతు రేటు పెట్టకుండా మోసం చేసిన అధికారులు పట్టించుకోలేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఐకెపి ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని దిగుమతి చేసుకోకుండా పెద్ద మిల్లులైతే రోజుకు రెండు లారీలు మాత్రమే దింపుకోవాలని చిన్న బిల్లు అయితే రోజుకు ఒక్క లారీ మాత్రమే దిగుమతి చేయాలని తీర్మానించినట్లు పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మే నెలలో అకస్మాతగా కురిసే అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతరని పలువురు విశ్లేషిస్తున్నారు.
వాతావరణ మార్పులతో రైతుల బెంబేలు
ప్రస్తుత వాతావరణ మార్పులు తుఫాను దిశగా వెళుతున్నట్లు పలు వార్తలు రావడంతో పాటు తెలంగాణ జిల్లాలలో వర్షాలు పడతాయని వార్తలు రావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి రైతులు తీవ్ర నష్టాలకు గురవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకెపి సెంటర్లలో కాంటాలు అయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించి మిల్లు యాజమాన్యాలు త్వరగా దిగుమతి చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
వెంటనే దిగుమతి చేయాలి
ప్రభుత్వం ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకోవాలి. మిల్లర్లు సిండికేట్ గా మారి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వడ్లను కూడా దిగుమతి చేసుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. వాతావరణ మార్పులతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నాము. అధికారులు స్పందించి దిగుమతులను వేగవంతం చేయాలి.
పర్శనబోయిన గోవర్ధన్, రైతు, వేములపల్లి
ట్యాగింగ్ ప్రకారం మిల్లర్లు దిగుమతి చేసుకోవాల్సిందే
మిల్లులకు నిర్దేశించిన ట్యాగింగ్ ప్రకారం ప్రతి మిల్లరు ఐకెపి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాల్సిందే. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం ప్రకారం మిల్లుకు టార్గెట్ ఫిక్స్ చేస్తాం దాని ప్రకారం తప్పనిసరిగా మిల్లర్లు దిగుమతి చేసుకోవాలి. దిగుమతి విషయంలో జాప్యం జరిపితే చర్యలు తప్పవు.
రవీందర్ రెడ్డి , సివిల్ సప్లై ఆర్‌ఐ






